ఫోన్ ట్యాపింగ్‌ కేసులో మరొకరు చంచల్‌గూడా జైలుకి

ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్‌ కేసు, పోలీస్ ఉన్నతాధికారుల అరెస్టులు తెలంగాణ రాజకీయాలలో ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. ఇప్పటికే ఈ కేసులో ఓ డీఎస్పీ, ఇద్దరు ఎస్పీలు, ఇద్దరు కానిస్టేబుల్స్ అరెస్ట్ అయ్యారు.

తాజాగా టాస్క్ ఫోర్స్ మాజీ ప్రత్యేక అధికారి రాధాకిషన్ రావు కూడా అరెస్ట్ అయ్యి జ్యూడిషియల్ రిమాండ్‌ మీద చంచల్‌గూడా జైలుకి వెళ్ళారు. ఈ కేసు దర్యాప్తు జరుగుతున్న కొద్దీ ఇంకా అనేక మంది పేర్లు బయటపడే అవకాశం ఉంది. 

రాష్ట్రంలో ప్రతిపక్ష నేతలు వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రుల ఫోన్ ట్యాపింగ్‌ చేయించడంతో పాటు ఈ అవకాశాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్రంలో రియల్ ఎస్టేట్, బంగారు నగల దుకాణాల యజమానుల ఫోన్లు కూడా ట్యాప్ చేసి ఆ వివరాలతో వారిని బ్లాక్ మెయిల్ చేసి డబ్బు గుంజిన్నట్లు పోలీసులు కనుగొన్నారు.

అలాగే ఎన్నికలలో రాధాకిషన్ రావు అధికార దుర్వినియోగానికి పాల్పడి, పోలీస్ సర్వీస్ మరియు ఎన్నికల నిబంధనలను ఉల్లంఘిస్తూ టాస్క్ ఫోర్స్ వాహనాలలోనే అప్పటి అధికార బిఆర్ఎస్‌ పార్టీకి చెందిన సొమ్ముని నియోజకవర్గాలకు తరలింపజేసిన్నట్లు వెస్ట్ జోన్ డీసీపీ ఎస్‌.ఎం.విజయ్‌ కుమార్‌ చెప్పారు. కనుక ఈ ఫోన్ ట్యాపింగ్‌ వ్యవహారం చుట్టూ తిరిగి మాజీ సిఎం కేసీఆర్‌ మెడకే చుట్టుకునే అవకాశం కనిపిస్తోంది.