బిఆర్ఎస్ నుంచి మరొకరు జంప్?

ఒకప్పుడు అన్ని పార్టీల నుంచి నేతలు, ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ పార్టీలోకి వస్తుండేవారు. కొంత మంది ఏదో విదంగా కేసీఆర్‌, కేటీఆర్‌, హరీష్ రావుల దృష్టిలో పడి ఆ పార్టీలో చేరేందుకు ప్రయత్నించేవారు. కానీ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓటమితో పరిస్థితులు తారుమారు అయ్యాయి.

ఇప్పుడు ఆ పార్టీ నుంచి ప్రతీరోజూ ఒకరిద్దరు నేతలు కాంగ్రెస్‌, బీజేపీలలో చేరిపోతూనే ఉన్నారు. ఆ వలసలు ఆపేందుకు కేసీఆర్‌ ఎంతగా ప్రయత్నిస్తున్నా ఆపలేకపోతున్నారు. దీంతో ఓ పక్క పార్టీ చాలా బలహీనపడుతుండగా, మరోపక్క పార్టీని వీడుతున్నవారే కాంగ్రెస్‌, బీజేపీ ఎంపీ అభ్యర్ధులుగా పోటీకి దిగుతుండటంతో, వారినే ఎదుర్కొని పోరాడవలసి వస్తోంది. 

ఇలాంటి సమయంలో నర్సాపూర్ మాజీ ఎమ్మెల్యే మధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ఆయన కాంగ్రెస్‌ నేత మైనంపల్లి హన్మంత రావుతో భేటీ అయ్యి కాంగ్రెస్ పార్టీలో చేరాలనుకుంటున్నట్లు చెప్పిన్నట్లు తెలుస్తోంది. నిజానికి ఆయనకు కేసీఆర్‌ టికెట్‌ నిరాకరించి సునీతా లక్ష్మారెడ్డికి ఇచ్చినప్పుడే ఆయన పార్టీని వీడేందుకు సిద్దపడ్డారు.

కానీ అప్పుడు కేసీఆర్‌ లోక్‌సభ ఎన్నికలలో మెదక్ టికెట్‌ ఇస్తానని బుజ్జగించడంతో వెనక్కు తగ్గారు. కానీ మెదక్ అభ్యర్ధిగా మాజీ ఐఏఎస్ అధికారి, ఎమ్మెల్సీ వెంకట్రామి రెడ్డి పేరు ప్రకటించడంతో, మధన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిపోవాలని నిర్ణయించుకున్నారు. ఒకవేళ ఆయన పార్టీని వీడితే లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీకి మెదక్‌లో ఎదురుదెబ్బ తగిలే అవకాశం ఉంటుంది.