బిఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ శనివారం ఎర్రవల్లి ఫామ్‌హౌస్‌లో పార్టీ ముఖ్య నేతలతో సమావేశమై కల్వకుంట్ల కవిత అరెస్ట్, లోక్‌సభ ఎన్నికలు, పార్టీ నుంచి వలసలు తదితర అంశాలపై చర్చించి వారికి దిశా నిర్దేశం చేశారు.
కల్వకుంట్ల కవిత అరెస్ట్ విషయంలో ఇప్పటికే న్యాయపరమైన పోరాటం చేస్తున్నామని, ఇప్పుడు ప్రజా క్షేత్రంలో కూడా దీనిపై పోరాడవలసిన సమయం ఆసన్నమైందని కేసీఆర్ అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీతోనే కాంగ్రెస్, బీజేపీలు పోటీ పడే పరిస్థితి నెలకొని ఉందని, 12-14 స్థానాలలో బిఆర్ఎస్తో అవి పోటీ పడాల్సి ఉంటుందని అన్నారు. అయినా బిఆర్ఎస్ పార్టీ 9 నుంచి 12 సీట్లు గెలుచుకునే అవకాశం ఉందని కేసీఆర్ చెప్పారు. అన్ని కోణాలలో నుంచి పరిశీలించిన తర్వాతే బలమైన అభ్యర్ధులను ఎంపిక చేసినందున ఈసారి ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని అన్నారు.
లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్, బీజేపీలు బిఆర్ఎస్ పార్టీని లక్ష్యంగా చేసుకొని అమలు చేస్తున్న రాజకీయ వ్యూహాలను కేసీఆర్ వారికి వివరించి, వాటిని ఏవిదంగా ఎదుర్కొంటూ ముందుకు సాగాలో తెలిపారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత జాతీయ స్థాయిలో కాంగ్రెస్ మరింత బలహీనపడి తుడిచిపెట్టుకుపోతుందని, బీజేపీకి కూడా బహుశః ఇదే చివరి అవకాశం కావచ్చన్నారు. రాబోయే రోజుల్లో ప్రాంతీయ పార్టీలే జాతీయ రాజకీయాలను శాశించబోతున్నాయని అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎవరూ కూలద్రోయక్కరలేదని, వారతంట వారే కూలద్రోసుకొని దిగిపోతారని కేసీఆర్ అన్నారు.
ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై స్పందిస్తూ, అధికారంలో ఉన్నప్పుడు పదవులు అనుభవించి, ఎన్నికలలో పార్టీ ఓడిపోగానే విడిచిపెట్టి వెళ్ళిపోయే అటువంటి నేతలు బిఆర్ఎస్ పార్టీకి అవసరం లేదని, పార్టీ జెండాని మోసే నాయకులే చాలని అన్నారు.
ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం బాధ్యతలను మన్నే గోవర్ధన్‌కు కేసీఆర్ అప్పగించారు. ముఖ్య నేతలు పార్టీని వీడిన నియోజకవర్గాలలో కూడా వేరే వారిని నియమించాలని కేసీఆర్ నిర్ణయించారు. లోక్‌సభ ఎన్నికలలో పార్టీ సమన్వయ బాధ్యతలను కేటీఆర్, హరీష్ రావులకు అప్పగించారు.