కాంగ్రెస్ పార్టీలో ఒక కుటుంబానికి ఒకే పదవి అనే నిబంధనను శాసనసభ ఎన్నికలలోనే పక్కన పెట్టేసి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఇద్దరికీ సీట్లు ఇచ్చింది. ఇప్పుడు భువనగిరి ఎంపీ సీటు కూడా తమ కుటుంబానికే ఇవ్వాలని వారు అధిష్టానంపై ఒత్తిడి చేస్తుండటం చూసి కాంగ్రెస్ పార్టీలో వారే అసహనం వ్యక్తం చేస్తున్నారు.
భువనగిరి ఎంపీ సీటుని కోమటిరెడ్డి (వెంకట్ రెడ్డి సతీమణి) సుశీలమ్మకు ఇవ్వాలని అన్నదమ్ములిద్దరూ పట్టుబడుతున్నారు. అయితే రాజగోపాల్ రెడ్డి ఈ వార్తలపై స్పందిస్తూ, “మా ఒత్తిడి వల్లనే కాంగ్రెస్ అధిష్టానం భువనగిరికి అభ్యర్ధిని ప్రకటించలేదని వస్తున్న వార్తలను మేము ఖండిస్తున్నాము. అయితే నియోజకవర్గంలో సుశీలమ్మ ఫౌండేషన్ ద్వారా చేపడుతున్న అనేక సామాజిక సేవా కార్యక్రమాలను చూసి ప్రజలే ఆమెకు టికెట్ ఇస్తే బాగుంటుందని, ఆమెకు ఇస్తే అవలీలగా భారీ మెజార్టీతో గెలుస్తారని అనుకుంటున్నారు.
కనుక అటువంటి బలమైన, మంచి అభ్యర్ధికే టికెట్ ఇస్తే బాగుంటుందని మేము కాంగ్రెస్ అధిష్టానానికి మా అభిప్రాయం చెప్పము తప్ప మా కుటుంబానికే టికెట్ ఇవ్వాలని పట్టుబట్టడం లేదు. కాంగ్రెస్ అధిష్టానం ఎవరిని అభ్యర్ధిగా ప్రకటించినా భారీ మెజార్టీతో గెలిపించుకుంటాము,” అని అన్నారు.