లిక్కర్ స్కామ్‌లో అరెస్ట్ అయిన ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్ బెయిల్ కోసం సుప్రీంకోర్టుని ఆశ్రయించగా హైకోర్టులోనే అప్పీలు చేసుకోమంటూ ఆయన అభ్యర్ధనను తిరస్కరించింది. అదే సమయంలో ఈ కేసుని విచారిస్తున్న ఢిల్లీ హైకోర్టు ఆయనను 6 రోజుల పాటు ఈడీ కస్టడీకి అనుమతించింది. ఈడీ అధికారులు ఆయనను అదుపులో తీసుకొని ఈ నెల 28 వరకు ఈ కేసు గురించి ప్రశ్నించనున్నారు.
గురువారం సాయంత్రం ఆయనను అరెస్ట్ చేసిన ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం హైకోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఇరుపక్షాల న్యాయవాదులు సుమారు రెండున్నర గంటలపాటు తమ వాదనలు వినిపించారు. అసలు సీబీఐ, ఈడీ చెపుతున్నట్లు ఢిల్లీ మద్యం పాలసీ రూపకల్పనలో ఏ కుంభకోణం జరగలేదని, ఇదంతా రాజకీయ కక్ష సాధింపు కోసం అల్లిన కట్టుకధ మాత్రమే అని, కుంభకోణం జరిగిన్నట్లు ఈడీ ఎటువంటి సాక్ష్యాధారాలు చూపకుండానే అర్వింద్ కేజ్రీవాల్‌ని అరెస్ట్ చేయడం చట్టవిరుద్దామని ఆయన తరపు న్యాయవాదులు వాదించారు.
ఈ కేసులో ప్రధాన సూత్రధారి అర్వింద్ కేజ్రీవాలే అని ఈడీ న్యాయవాదులు వాదించారు. ఢిల్లీ ప్రభుత్వ లిక్కర్ పాలసీ రూపకల్పనకు ముఖ్యమంత్రి సంబంధం లేదని ఎలా చెప్పగలరని ప్రశ్నించారు. తెలంగాణకు చెందిన బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తదితరుల నుంచి అర్వింద్ కేజ్రీవాల్ రూ.100 కోట్లు ముడుపులు నాలుగు వేర్వేరు మార్గాలలో అర్వింద్ కేజ్రీవాల్ అందుకున్నారని ఈడీ న్యాయవాదులు తెలిపారు. ఈ కేసులో అర్వింద్ కేజ్రీవాల్ పాత్ర గురించి ఆమె వాంగ్మూలంతో కూడిన 28 పేజీల రిమాండ్ రిపోర్టును వారు హైకోర్టుకి సమర్పించారు.
ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత ఈడీ వాదనలతో హైకోర్టు ఏకీభవిస్తూ, ఈ కేసులో అర్వింద్ కేజ్రీవాల్‌ని ప్రశ్నించేందుకు ఆరు రోజులు కస్టడీకి అనుమతించింది.
ఇదే కేసులో అరెస్ట్ అయ్యి ప్రస్తుతం ఈడీ కస్టడీలో ఉన్న కల్వకుంట్ల కవితకు కూడా సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించింది. నేటితో(శనివారం) ఆమె కస్టడీ ముగియనుంది. కానీ ఇప్పుడు అర్వింద్ కేజ్రీవాల్‌ని కూడా ఈడీ కస్టడీలోకి తీసుకుంది కనుక ఇద్దరినీ కలిపి ప్రశ్నించేందుకు మరికొన్ని రోజులపాటు కల్వకుంట్ల కవిత కస్టడీ కోరే అవకాశం ఉంది. ఒకవేళ కస్టడీకి అనుమతించకపోతే, జ్యూడిషియల్ రిమాండ్ మీద తీహార్ జైలుకి వెళ్ళక తప్పకపోవచ్చు.