అయ్యో! మేయర్ విజయ లక్ష్మి కూడా జంప్?

బిఆర్ఎస్ పార్టీలో మరో పెద్ద వికెట్ పడబోతోంది. హైదరాబాద్‌ మేయర్ గద్వాల విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరే అవకాశం ఉంది.

ఈరోజు ఉదయం రాష్ట్ర కాంగ్రెస్‌ వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, అంబర్ పేట నుంచి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా శాసనసభకు పోటీ చేసి ఓడిపోయిన రోహిన్ రెడ్డితో కలిసి బంజారాహిల్స్‌ రోడ్ నంబర్: 12లో ఉన్న మేయర్ విజయలక్ష్మి ఇంటికి చేరుకున్నారు. దాదాపు 45 నిమిషాలపాటు వారు చర్చలు జరిపారు. మేయర్ విజయలక్ష్మిని కాంగ్రెస్ పార్టీలో చేరవలసిందిగా వారు ఆహ్వానించిన్నట్లు తెలుస్తోంది. 

ఈ సమావేశంలో బిఆర్ఎస్ పార్టీ సెక్రెటరీ జనరల్ కె.కేశవ రావు కూడా పాల్గొన్నట్లు తెలుస్తోంది. కానీ ఆయన కూడా పాల్గొన్నారా లేదా అనే విషయం నిర్దారణ కావలసి ఉంది. ఇప్పటికే డెప్యూటి మేయర్ మోతే శోభ, పలువురు కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. ఇటీవలే ఖైరతాబాద్ బిఆర్ఎస్ ఎమ్మెల్యే దానం నాగేందర్ కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. 

ఒకవేళ మేయర్ విజయలక్ష్మి కాంగ్రెస్ పార్టీలో చేరితే, ఇక హైదరాబాద్‌లో బిఆర్ఎస్ పార్టీ పతనం మరింత వేగవంతం అవుతుంది. ఆమెతో పాటు పలువురు కార్పొరేటర్లు కూడా కాంగ్రెస్ పార్టీలో చేరిపోయే అవకాశం ఉంటుంది.