నాగర్‌కర్నూల్‌ టికెట్‌ మల్లు రవికే!

లోక్‌సభ టికెట్ల కోసం తెలంగాణ కాంగ్రెస్‌ పార్టీలో చాలా మంది పోటీ పడుతుండటంతో అభ్యర్ధుల జాబితా ప్రకటించడం ఆలస్యం అవుతోంది. నాగర్‌ కర్నూల్‌ టికెట్‌ కోసం ఏఐసీసీ కార్యదర్శి సంపత్ కుమార్‌, మల్లు రవి పోటీ పడుతున్నారు. 

మల్లు రవిని ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా నియమించినప్పటికీ ఆయన నాగర్‌ కర్నూల్‌ నుంచి పోటీ చేసేందుకు ఇటీవలే ఆ పదవికి రాజీనామా చేశారు. ఆయన ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సోదరుడు అవడంతో తనకు టికెట్‌ దక్కకుండా కొందరు కుట్రలు చేస్తున్నారంటూ సంపత్ కుమార్‌ సోనియా గాంధీకి ఇటీవల లేఖ వ్రాశారు. ఏఐసీసీ కార్యదర్శిగా ఉన్న ఆయన ఈవిధంగా లేఖ వ్రాయడాన్ని కాంగ్రెస్‌ అధిష్టానం తీవ్రంగా పరిగణించి ఆయనను పక్కన పెట్టి మల్లు రవిని నాగర్‌ కర్నూల్‌ కాంగ్రెస్‌ అభ్యర్ధిగా గురువారం రాత్రి ప్రకటించింది. 

ఖమ్మం జిల్లాలోని లక్ష్మీపురానికి చెందిన మల్లు రవి 1991,1998లో రెండుసార్లు నాగర్‌ కర్నూల్‌ ఎంపీగా ఉన్నారు. 2004 నుంచి 2008 ఢిల్లీ రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రతినిధిగా పనిచేశారు. 2008లో శాసనసభ ఉప ఎన్నికలలో జడ్చర్ల నుంచి పోటీ చేసి ఎమ్మెల్యే అయ్యారు. ప్రస్తుతం పిసిసి సీనియర్ ఉపాధ్యక్షులుగా ఉన్నారు.