ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్

ఆమాద్మీ పార్టీ అధినేత, ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయ్యారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో ఆయన ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే. ఆయనని అరెస్ట్ చేయకుండా ఈడీని ఆదేశించలేమని నిన్న ఢిల్లీ హైకోర్టు తీర్పు చెప్పిన కొద్ది సేపటికే, ఈడీ అడిషినల్ డైరెక్టర్‌ నేతృత్వంలో పది మంది అధికారులు ఫ్లాగ్ స్టాఫ్ రోడ్‌లోని అర్వింద్ కేజ్రీవాల్‌ నివాసానికి చేరుకున్నారు.

అక్కడ ముందుగానే భారీగా పోలీసులను మోహరించారు.  సుమారు 2 గంటలు ఆయనని ఇంట్లోనే విచారించిన తర్వాత రాత్రి 9 గంటలకు అరెస్ట్ వారెంట్‌ని ఆయన భార్యకు  అందజేసి తమతో ఈడీ కార్యాలయానికి తీసుకుపోయారు. ఈరోజు ఉదయం ఆయనకు వైద్య పరీక్షలు నిర్వహించి కోర్టులో ప్రవేశపెట్టనున్నారు. కోర్టు అనుమతిస్తే కస్టడీలోకి తీసుకొని ప్రశ్నించనున్నారు.

ఢిల్లీలో ఆమాద్మీ పార్టీని రాజకీయంగా ఎదుర్కోలేక, శాసనసభ ఎన్నికలలో ఓడించలేక పోతుండటంతో ప్రధాని నరేంద్రమోడీ అర్వింద్ కేజ్రీవాల్‌పై కక్ష కట్టారని, అందుకే లోక్‌సభ ఎన్నికలకు ముందు అరెస్ట్ చేయించారని ఆమాద్మీ నేతలు వాదిస్తున్నారు. అర్వింద్ కేజ్రీవాల్‌ అరెస్ట్ అయినప్పటికీ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయబోరని, అవసరమైతే ఆయన జైలు నుంచే పాలన కొనసాగిస్తారని ఆమాద్మీ పార్టీ తెలిపింది. 

అవినీతి కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి అరెస్ట్ కావడం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి ప్రియాంకా వాద్రా, రాహుల్ గాంధీ, ఇతర కాంగ్రెస్‌ నేతలు, తమిళనాడు సిఎం స్టాలిన్, కేరళ సిఎం పినరయి విజయన్, ఆయన అరెస్టుని ఖండించారు.  

అర్వింద్ కేజ్రీవాల్‌ తరపున న్యాయవాదులు ఢిల్లీ హైకోర్టు తీర్పుని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో గురువారం రాత్రి పిటిషన్‌ వేశారు. ఈరోజు దానిపై సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది. 

ఇదే కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కూడా ఈడీ అధికారులు అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తున్న సంగతి తెలిసిందే. ఆమె కూడా సుప్రీంకోర్టులో అప్పీలు చేసుకున్నారు.