ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు హైకోర్టు షాక్... అరెస్ట్ ఆపలేము!

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ సిఎం అర్వింద్ కేజ్రీవాల్‌కు ఈరోజు ఢిల్లీ హైకోర్టులో షాక్ తగిలింది. ఈ కేసులో ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయలేమని తేల్చి చెప్పేసింది. ఈ కేసులో విచారణకు హాజరు కావాలని ఈడీ ఇప్పటికే తొమ్మిది సార్లు నోటీసులు ఇచ్చింది కానీ ఆయన అరెస్ట్ భయంతో హాజరు కాకుండా తప్పించుకుంటున్నారు. 

నేడు ఈడీ విచారణకు హాజరు కావలసి ఉండగా వెళ్ళకుండా హైకోర్టుని ఆశ్రయించారు. ఈ కేసులో తనను ఈడీ అరెస్ట్ చేయకుండా ఆదేశాలు జారీ చేయాలని ఆయన అభ్యర్ధనను హైకోర్టు తిరస్కరించింది. ఏ దశలో ఎటువంటి ఆదేశాలు జారీ చేయలేమని స్పష్టం చేసింది. ఈ కేసు తదుపరి విచారణను ఏప్రిల్‌ 22కి వాయిదా వేసింది. 

ఇప్పటికే ఇదే కేసులో ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా, ఆమాద్మీ ఎంపీ సంజయ్ సింగ్‌ తిహార్ జైలులో ఉండగా, తాజాగా బిఆర్ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని కూడా ఈడీ అరెస్ట్ చేసి కస్టడీలోకి తీసుకొని ప్రశ్నిస్తోంది. ఆమె కూడా సుప్రీంకోర్టుని ఆశ్రయించారు. ఆమెకు సుప్రీంకోర్టు బెయిల్‌ మంజూరు చేస్తుందో లేదో ఇంకా తెలియవలసి ఉంది.