తెలంగాణ నిఘా విభాగంలో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ కేసుపై బుధవారం హైకోర్టులో సుదీర్ఘంగా వాదనలు జరిగాయి. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలు విన్న తర్వాత తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.
ఈ కేసులో ఎటువంటి సాక్ష్యాధారాలు లేకుండానే పోలీసులు ప్రణీత్ రావుని అరెస్ట్ చేశారని, నాంపల్లి కోర్టు కూడా లోతుగా పరిశీలించకుండానే పోలీస్ కస్టడీకి అనుమతించిందని ప్రణీత్ రావు తరపు న్యాయవాది గండ్ర మోహన్ రావు వాదించారు.
నిబంధనలకు విరుద్దంగా ఉదయం 8 నుంచి రాత్రి 8 గంటల వరకు ప్రణీత్ రావుని పోలీసులు విచారిస్తున్నారని, పోలీస్ స్టేషన్‌లో నిద్రపోయేందుకు సరైన సౌకర్యం లేదని హైకోర్టు దృష్టికి తీసుకువచ్చారు. ఈ కేసులో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను పోలీసులు పట్టించుకోవడం లేదన్నారు.
ప్రభుత్వం తరపు న్యాయవాది వాదిస్తూ, ప్రణీత్ రావు ఫోన్ ట్యాపింగ్ చేసిన్నట్లు, సాక్ష్యాధారాలను ధ్వంసం చేసిన్నట్లు ఆధారాలు ఉన్నాయని అందుకే పోలీసులు కేసు నమోదు చేసి అరెస్ట్ చేశారని తెలిపారు. ప్రణీత్ రావుని ప్రతిరోజు ఆయన బంధువులు, అతని కౌన్సిల్ వాసుదేవన్ కలిసేందుకు పోలీసులు అనుమతిస్తున్నారని చెప్పారు.
ఈ కేసుపై విచారణ జరుపుతున్న పోలీస్ అధికారులు ఎవరూ ఈ కేసుకి సంబంధించి ఎటువంటి సమాచారాన్ని మీడియాకు ఇవ్వడం లేదని, కానీ ప్రణీత్ రావు తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని వాదించారు. ప్రణీత్ రావుని కస్టడీలో తీసుకొని ప్రశ్నిస్తున్నప్పుడు ఈవిధంగా హైకోర్టులో కేసు వేయడం సరికాదని, కనుక ఈ కేసుని కొట్టేయాలని విజ్ఞప్తి చేశారు.
ఇరుపక్షాల వాదనలు విన్న తర్వాత ఈ కేసులో తీర్పుని రిజర్వ్ చేస్తున్నట్లు హైకోర్టు ప్రకటించింది.