గమనిక: నేను పార్టీ మారడం లేదు: ఎర్రబెల్లి

బిఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్‌, బీజేపీలలోకి జోరుగా వలసలు సాగుతున్నందున సోషల్ మీడియాలో నిత్యం ఎవరో ఒకరి పేరు వినిపిస్తూనే ఉంది. తాజాగా మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు పేరు వినిపిస్తోంది. ఆయన వెంటనే స్పందిస్తూ, “నేను పార్టీ మారడం లేదు. అలాంటి ఆలోచన నాకు లేదు. కనుక సోషల్ మీడియాలో వచ్చే పుకార్లను నమ్మవద్దని అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. 

గతంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా చాలా ఒత్తిళ్ళు ఎదుర్కొన్నాను కానీ పార్టీ మారలేదు. ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ కష్టకాలంలో విడిచిపెట్టి వెళ్ళిపోయే ప్రసక్తే లేదు. బిఆర్ఎస్ పార్టీలో కాంట్రాక్టర్లు, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు, ఇంకా భూకబ్జాలకు పాల్పడినవారు, అవినీతి అక్రమాలకు పాల్పడినవారు మాత్రమే కాంగ్రెస్‌, బీజేపీలలోకి వెళ్ళిపోతున్నారు. అటువంటివారు ఎంతమంది వెళ్ళిపోయినా పార్టీకి నష్టం లేదు.

కనుక పార్టీ కార్యకర్తలందరూ ధైర్యంగా ఉండాలని విజ్ఞప్తి చేస్తున్నాను. ఎన్నికలలో పార్టీల గెలుపోటములు చాలా సహజం. కనుక పదవీ, అధికారం పోయినంత మాత్రన్న పార్టీలో ఎవరూ వాటి కోసం అల్లాడిపోవడం లేదు. అందరం ధైర్యం కాంగ్రెస్, బీజేపీలను ఎదుర్కొని ప్రజా పాలన సమస్యలపై పోరాడుతూనే ఉంటాము. పార్టీని కాపాడుకుంటాము,” అని అన్నారు.        

ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో తన పేరు వినిపిస్తుండటంపై స్పందిస్తూ, “నాకు దాని గురించి తెలీదు. కానీ ఆకేసులో అరెస్ట్ అయిన ప్రణీత్ రావుని నా పేరు చెప్పాలని అధికారులు ఒత్తిడి చేస్తున్నట్లు తెలిసింది. నాకు అతను ఎవరో తెలీదు. ఆ ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంతో నాకు ఎటువంటి సంబందమూ లేదు,” అని ఎర్రబెల్లి దయాకర్ రావు స్పష్టం చేశారు.