అమెరికా అధ్యక్ష ఎన్నికలకి కేవలం కొన్ని గంటలు వ్యవధి మాత్రమే మిగిలి ఉంది. ఇటువంటి అత్యంత కీలకమైన సమయంలో హిల్లరీ క్లింటన్, డోనాల్డ్ ట్రంప్ కి సంబంధించి రెండు ఆసక్తికరమైన పరిణామాలు జరిగాయి.
రిపబ్లికన్ పార్టీ చేస్తున్న ఆరోపణలని పరిగణన లోకి తీసుకొని హిల్లరీ క్లింటన్ ప్రైవేట్ ఈ-మెయిల్స్ వ్యవహారంపై దర్యాప్తు చేసి, అవి నకిలీవని తేలడంతో విచారణ నిలిపివేస్తున్నట్లు ఎఫ్.బి.ఐ.డైరెక్టర్ జేమ్స్ కోమే జేమ్స్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇప్పటికే ట్రంప్ పై కొద్దిగా ఆధిక్యతలో ఉన్న హిల్లరీకి ఎఫ్.బి.ఐ.డైరెక్టర్ జేమ్స్ చేసిన ఈ ప్రకటన వలన అమెరికన్ ప్రజల..ముఖ్యంగా మహిళల సానుభూతి, మద్దతు ఇంకా పెరుగవచ్చు.
ఇక డోనాల్డ్ ట్రంప్ కూడా ఆఖరి నిమిషంలో ఉద్యోగాల గురించి మళ్ళీ పాతపాటే పాడి అమెరికన్లని తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు. నిజానికి మొదట ఆ వాదన కారణంగానే హిల్లరీతో పోటీ పడగల స్థాయికి ట్రంప్ ఎదిగారని చెప్పవచ్చు. కానీ మద్యలో ఆ విషయం పక్కనబెట్టి హిల్లరీపై వ్యక్తిగతంగా ఆరోపణలు చేయడం, ఆమె ఈ-మెయిల్స్ వ్యవహారం గురించి మాట్లాడి ఎదురుదెబ్బలు తిన్నారు. ఆ కారణంగా హిల్లరీకి కొంత నష్టం జరిగినప్పటికీ ఆమె మళ్ళీ పుంజుకోవడంతో, ట్రంప్ కూడా తను ఏ అంశంతో ప్రజలని ఆకట్టుకోగలిగాడో గుర్తు చేసుకొని మళ్ళీ దాని గురించే ఇప్పుడు గట్టిగా మాట్లాడుతూ అమెరికన్ ప్రజలని తనవైపు తిప్పుకోవాలని ప్రయత్నిస్తున్నారు.
అమెరికన్ల ఉద్యోగాలని భారత్, చైనా, తైవాన్, సింగపూర్, మెక్సికో తదితర దేశాలు దొంగిలించుకుపోతున్నాయని ఆ కారణంగా దేశంలో అమెరికన్ యువతకి ఉద్యోగాలు దొరకడం లేదని ట్రంప్ వాదించారు. దాని వలన అమెరికాలో స్థిరపడిన లక్షలాది మంది విదేశీయులు, అవుట్ సోర్సింగ్ పద్దతిలో అమెరికా సంస్థలకి సేవలు అందిస్తున్న విదేశీ సంస్థలు, ఆ దేశాలలో ట్రంప్ పట్ల తీవ్ర వ్యతిరేకత ఏర్పడి ఉండవచ్చు కానీ సరిగ్గా అదేకారణంతో ఆయన అమెరికన్ల మద్దతు పొందగలిగారు.
కనుక తను అధ్యక్షుడయితే, విదేశాలకి వెళ్ళిపోతున్న ఉద్యోగాలని అడ్డుకొంటానని అటువంటి సంస్థలపై 35శాతం పన్ను విదిస్తానని, అమెరికన్ యువతకి ప్రాధాన్యత ఇచ్చే సంస్థలకి పన్ను తగ్గిస్తానని ట్రంప్ ప్రకటించారు. ఈ సందర్భంగా దేశంలో ఎక్కడెక్కడ, ఏ సంస్థలలో ఎంతమంది అమెరికన్లు ఉద్యోగాలు కోల్పోయారో ఆయా కంపెనీల పేర్లతో సహా గణాంకాలతో సహా ట్రంప్ వివరించారు. తను అమెరికా అధ్యక్షుడయితే అన్ని ఉద్యోగాలు అమెరికన్లకే అనే విధానాన్ని అమలుచేస్తానని ప్రకటించారు. అదేవిదంగా అమెరికాకి తీవ్ర నష్టం కలిగిస్తున్న నార్త్ అమెరికన్ ఫ్రీ ట్రేడ్ అగ్రిమెంట్ ని కూడా పునసమీక్షిస్తానని ట్రంప్ ప్రకటించారు.
అమెరికన్లని ఆకట్టుకోగల ఈ వాదనని ట్రంప్ మొదటి నుంచి నేటివరకు కొనగించి ఉండి ఉంటే హిల్లరీని అవలీలగా ఓడించి ఉండేవారేమో కానీ మద్యలో దారి తప్పి అనేక వివాదస్పదమైన విషయాలలో తలదూర్చడంతో చాలా నష్టపోయారు. ఆఖరు నిమిషంలో ట్రంప్ పాడుతున్న ఈ అమెరికన్ సాంగ్ విని అమెరికన్ యువత ఆయనకి ఓట్లు వేస్తారో లేదో మరికొన్ని గంటలలో తేలిపోతుంది.