తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తవడంతో సిఎం రేవంత్ రెడ్డి బషీర్ బాగ్లో గల ఆడిటోరియంలో ‘మీట్ ది ప్రెస్’ నిర్వహించి మీడియా ప్రతినిధులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పారు.
మేము అధికారంలోకి వచ్చిన మర్నాటి నుంచే బిఆర్ఎస్, బీజేపీలు మా ప్రభుత్వాన్ని కూలగొడతామని బెదిరించడం మొదలుపెట్టాయి. బిఆర్ఎస్లో కడియం శ్రీహరి, బీజేపీ లక్ష్మణ్ వంటి సీనియర్లు కూడా ఈవిధంగా ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరించడం చాలా శోచనీయం.
లోక్సభ ఎన్నికల తర్వాత మా ప్రభుత్వాన్ని పడగొడతామని గడువు కూడా ప్రకటించారు. వారు మా ప్రభుత్వాన్ని పడగొడతామని బెదిరిస్తూ ఉంటే, మేము చేతులు ముడుచుకొని చూస్తూ కూర్చోవాలా? కనుక కొన్ని కటిన చర్యలు తీసుకోవలసి వచ్చింది. దాని ఫలితాలు ఎలా ఉంటాయో మీరే చూడబోతున్నారు.
ఈ వంద రోజులు పూర్తిగా ప్రజల కోసమే పనిచేశాము. రాజకీయాలు చేయాలని ప్రయత్నించలేదు. ఇప్పుడు ఎన్నికల కోడ్ వచ్చింది కనుక ఇవాళ్ళ నుంచి పిసిసి అధ్యక్షుడుగా, ఓ రాజకీయ నాయకుడుగా పనిచేస్తాను. కాంగ్రెస్ పార్టీ గేట్లు ఎత్తేస్తే ఎలా ఉంటుందో మీరే చూస్తారు,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
కేసీఆర్ గురించి మాట్లాడుతూ, “ఆయన నిజాం నవాబులకు నకలు వంటివారు, ఆయనకు ప్రజాస్వామ్యం, రాజ్యాంగం, ప్రజలు, ప్రతిపక్షాలు, మీడియా స్వేచ్ఛపై ఏమాత్రం గౌరవం లేదు. తెలంగాణ సంస్కృతీ సాంప్రదాయాలను నాశనం చేసి ఆనాడు నిజాం నవాబులు వంశపారంపర్య పరిపాలన చేసిన్నట్లుగానే కేసీఆర్ కూడా చేయాలనుకున్నారు. కానీ తెలంగాణ ప్రజలు తిప్పి కొట్టారు.
తెలంగాణ అనే తులసివనంలో కేసీఆర్ నాటిన అనేక గంజాయి మొక్కలను నిర్ధాక్షిణ్యంగా పీకి పక్కన పడేశాము. ఇంకా చాలా ఉన్నాయి. వాటిలో విద్యుత్ శాఖలో కొందరున్నారు. వారిలో తన్నీరు ఇంటి పేరు ఉంటే అది పన్నీరు అయిపోదు. గంజాయి మొక్క ఎవరు నాటినా అది గంజాయి మొక్కే అవుతుంది తప్ప తులసి మొక్క కాలేదు. విద్యుత్ శాఖలో అటువంటి మొక్కలను కూడా త్వరలోనే పీకి బయటపడేస్తాము,” అని అన్నారు.
కానీ మా ప్రభుత్వం రాష్ట్రంలో అందరూ స్వేచ్ఛగా జీవించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటోంది. మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు అందరికీ కూడా వారి పనులు వారు స్వేచ్ఛగా చేసుకునేందుకు అవకాశం కల్పించాము. ప్రభుత్వానికి-ప్రజలకు మద్య ఉన్న దూరాన్ని, అడ్డుగోడలను తొలగించేస్తున్నాము. ప్రతిపక్ష ఎంపీ, ఎమ్మెల్యేలు కూడా స్వేచ్ఛగా మమ్మల్ని కలిసి ప్రజా సమస్యల గురించి మాట్లాడగలుగుతున్నారు.
అధికారంలోకి వచ్చిన వెంటనే ఆరోగ్యశ్రీ,మహాలక్ష్మి పధకాలను అమలుచేశాం. ఆ తర్వాత గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్ళు, సబ్సీడీ గ్యాస్ సిలిండర్లు వంటి మరికొన్ని హామీలను అమలుచేసి ప్రజల మన్ననలు పొందుతున్నాము. సంక్షేమ పధకాలతో పాటు తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి విషయంలోనూ చాలా చిత్తశుద్ధితో, పారదర్శకంగా పనిచేస్తున్నాము," అని రేవంత్ రెడ్డి అన్నారు.