ఢిల్లీలో ఏపీ భవన్‌ ఆస్తులు విభజన ఇలా...

రాష్ట్ర విభజన జరిగి దాదాపు పదేళ్ళ తర్వాత ఇప్పటికీ ఢిల్లీలోని వేలకోట్లు విలువ చేసే ఏపీ భవన్‌ ఆస్తుల పంపకాలు పూర్తయ్యాయి. మార్చి 11న దీనిపై రెండు రాష్ట్రాల ఉన్నతాధికారులు కేంద్ర హోంశాఖ అధ్వర్యంలో జరిగిన సమావేశంలో పాల్గొని రాష్ట్ర విభజన చట్టం ప్రకారం 58.32శాతం : 41.68శాతం నిష్పత్తిలో ఏపీ భవన్‌ ఉమ్మడి ఆస్తి విభజనకు అది చేసిన ప్రతిపాదనకు ఆమోదం తెలిపాయి. 

దాని ప్రకారం మొత్తం రూ.9,913.50 కోట్లు విలువగల 19.781 ఎకరాల విస్తీర్ణంలో గల ఏపీ భవన్‌లో ఏపీకి రూ.9,913.50 కోట్లు విలువ గల 11.536 ఎకరాలు, తెలంగాణ రాష్ట్రానికి రూ.4,132.08 కోట్లు విలువగల 8.245 ఎకరాలు దక్కాయి.

ఏపీ భవన్‌ భూములలో అశోకా రోడ్డు వైపు గల 0.043 ఎకరాల భూమి ఆక్రమణలో ఉంది. ఒకవేళ దానిని విడిపించలేకపోతే రెండు రాష్ట్రాలు దానిపై హక్కు వదులుకొనేందుకు సిద్దమని తెలియజేశాయి. ఈ ప్రతిపాదనకు రెండు రాష్ట్రాలు అంగీకారం తెలుపడంతో కేంద్ర హోంశాఖ వెంటనే ఈ మేరకు రెండు రాష్ట్రాలకు ఆస్తులు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.