ఏపీ నేతలను తెలంగాణ ప్రజలు ఏమాత్రం పట్టించుకోనప్పటికీ, తెలంగాణ మంత్రులు, నేతలు ఏపీకి వెళ్తే మాత్రం ప్రజలు ఘనస్వాగతం పలుకుతుంటారు. రేవంత్ రెడ్డి తెలంగాణ సిఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత తొలిసారిగా శనివారం ఏపీకి వెళ్ళారు.
వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ, ఏపీ కాంగ్రెస్ ఏర్పాటు చేసిన ‘న్యాయ సాధన సభ’లో పాల్గొనేందుకు సిఎం రేవంత్ రెడ్డి విశాఖ విమానాశ్రయం చేరుకున్నప్పుడు ఆయనకు ప్రజలు, కాంగ్రెస్ కార్యకర్తలు ఘనస్వాగతం పలికారు.
విమానాశ్రయం నుంచి అనకాపల్లి మార్గంలో ఏర్పాటు చేసిన సభకు రోడ్డు మార్గంలో తరలివెళుతున్నప్పుడు, కాన్వాయ్‌లో రేవంత్ రెడ్డిని చూసి ప్రజలు చేతులు ఊపుతూ పలకరించారు. సిఎం రేవంత్ రెడ్డి కూడా వారందరికీ అభివాదం చేస్తూ ముందుకు సాగిపోయారు.
సభలో కూడా సిఎం రేవంత్ రెడ్డి మాట్లాడేందుకు లేచి నిలబడగానే అందరూ హర్షధ్వానాలు చేశారు. రేవంత్ రెడ్డి మాటాడుతూ, తెలంగాణలో కూడా కాంగ్రెస్ పని అయిపోయిందని అందరూ అన్నారని, కానీ ఎన్నికలలో ఢిల్లీలో మోడీని, గల్లీలో కేసీఆర్‌ని ఓడించి అధికారంలోకి వచ్చామన్నారు.
ఏపీలో కూడా అలాగే కాంగ్రెస్ పార్టీ తప్పకుండా అధికారంలోకి వస్తుందని, ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిలకు ఏ సాయం కావాలన్నా చేసేందుకు సిద్దంగా ఉన్నానని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు. వైఎస్ షర్మిల తప్పకుండా ఏపీ ముఖ్యమంత్రి అవుతారని, ఆమెను గెలిపిస్తే ప్రజల కోసం ధైర్యంగా కేంద్ర ప్రభుత్వంతో పోరాడుతారని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
గత ఏపీ శాసనసభ ఎన్నికలలో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సహాయపడి జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయ్యేందుకు తోడ్పడగా, ఈసారి సిఎం రేవంత్ రెడ్డి ఏపీ కాంగ్రెస్‌కు సాయపడుతుండటం విశేషం.
కానీ రాష్ట్ర విభజన చేసినందుకు ఏపీలో కాంగ్రెస్ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. గత పదేళ్లుగా ఏపీలో కాంగ్రెస్ ఉనికే లేదు. కనుక ఇప్పుడు వైఎస్ షర్మిల ఎంతగా ప్రయత్నించినప్పటికీ, ఏపీ కాంగ్రెస్ గెలిచే పరిస్థితి లేదు. కనుక ఈసారి 25 ఎమ్మెల్యే, 5 ఎంపీ సీట్లు ఇచ్చి ఏపీ కాంగ్రెస్‌ని గెలిపిస్తే చాలాని సిఎం రేవంత్ రెడ్డి ఏపీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు.