ఇటీవల సిఎం రేవంత్ రెడ్డి, ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు యాదాద్రి శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారిని దర్శించుకొన్న తర్వాత, అందరికీ వేద పండితులు వేదాశీర్వచనాలు పలికారు.
ఈ సందర్భంగా అందరికీ కుర్చీలు వేయగా ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు కుర్చీకి బదులు చిన్న స్టూల్ మీద కూర్చోబెట్టడంతో ఆయనని అవమానించారంటూ ప్రతిపక్షాలు తీవ్ర విమర్శలు గుప్పించాయి. ఉప ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా ఆలయానికి వచ్చిన ఆయన పట్ల ఆలయ అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడాన్ని తప్పు పట్టారు.
దీనిని భట్టి విక్రమార్క తేలికగా కొట్టి పడేసినప్పటికీ, దేవాదాయ శాఖ సీరియస్‌గానే తీసుకుంది. వెంటనే యాదాద్రి ఆలయ ఈవో రామకృష్ణారావుపై బదిలీ వేటు వేసి ఆయన స్థానంలో భాస్కర్ రావుని ఆలయ ఈవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. భాస్కర్ రావు వెంటనే ఈవోగా బాధ్యతలు స్వీకరించారు.