ఊహించిన్నట్లే బీజేపీ సీనియర్ నేత, మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి శుక్రవారం కాంగ్రెస్ పార్టీలో చేరిపోయారు. సిఎం రేవంత్ రెడ్డి స్వయంగా మొన్న ఆయన ఇంటికి వెళ్ళి పార్టీలోకి ఆహ్వానించిన సంగతి తెలిసిందే.
జితేందర్ రెడ్డి తన కుమారుడు మిధున్ కుమార్ రెడ్డి, అనుచరులను వెంటబెట్టుకొని శుక్రవారం సాయంత్రం జూబ్లీహిల్స్‌లోని సిఎం రేవంత్ రెడ్డి నివాసానికి చేరుకున్నారు. వారికి సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు భట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి, రాష్ట్ర వ్యవహారాల ఇన్చార్జి దీపాదాస్ మున్షీ సాదరంగా స్వాగతం పలికి కండువాలు కప్పి కాంగ్రెస్ పార్టీలో చేర్చుకున్నారు.
జితేందర్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన వెంటనే ఆయనకు ఒకేసారి రెండు పదవులు కట్టబెడుతూ సాధారణ పరిపాలన శాఖ జీవోలు జారీ చేయడం విశేషం. ఢిల్లీలో తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక నిధిగా ఒక పదవి, మరొకటి రాష్ట్ర ప్రభుత్వానికి (క్రీడా వ్యవహారాలు) సలహాదారు పదవి లభించాయి.
కాంగ్రెస్‌లో చేరే ముందుగానే జితేందర్ రెడ్డి తన రాజీనామా లేఖను బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు పంపించారు. దానిలో ఆయన కొన్ని ముఖ్యమైన విషయాలు పేర్కొన్నారు.
శాసనసభ ఎన్నికలకు ముందు బండి సంజయ్‌ని అధ్యక్ష పదవి నుంచి తొలగించి పార్టీని ఓడిపోయేలా చేశారని తప్పు పట్టారు. ఈ కారణంగానే శాసనసభ ఎన్నికలలో గెలిచి రాష్ట్రంలో అధికారంలోకి రావాల్సిన బీజేపీ కేవలం 8 సీట్లకే పరిమితమైందని గుర్తు చేశారు. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు పార్టీలో ఉన్న సీనియర్లని కాదని బిఆర్ఎస్ పార్టీలో నుంచి చేర్చుకున్నవారికి టికెట్స్ ఇవ్వడాన్ని జితేందర్ రెడ్డి తప్పు పట్టారు.
తెలంగాణలో బీజేపీ బలోపేతం చేసేందుకు కృషి చేస్తున్నవారికి ప్రాధాన్యం ఇవ్వకుండా బయట నుంచి తెచ్చుకున్నవారికే ప్రాధాన్యం ఇవ్వడం సరికాదని, కనుక పార్టీ విధానాలు, వైఖరితో విభేదిస్తున్న కారణంగా పార్టీని వీడవలసి వస్తోందని జితేందర్ రెడ్డి తన రాజీనామా లేఖలో పేర్కొన్నారు.
జితేందర్ రెడ్డి మహబూబ్ నగర్ నుంచి లోక్‌సభకు పోటీ చేయాలనుకుంటే బీజేపీ అధిష్టానం డికె అరుణకు ఆ టికెట్ కేటాయించడంతో ఆయన తీవ్ర అసంతృప్తితో పార్టీని వీడారు.