ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకుపోయారు. ఆమెకు మద్దతు తెలిపేందుకు బిఆర్ఎస్ అధినేత కేసీఆర్, పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, కొందరు ముఖ్య నేతలు నేడు ఢిల్లీకి వెళ్ళనున్నారు. వారు సుప్రీంకోర్టులో ఈ కేసుని వాదిస్తున్న న్యాయవాదులను కలిసి మాట్లాడిన తర్వాత జాతీయ మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది.
ఈడీ అధికారులు ఆమెను ఈరోజు ఢిల్లీలో రౌస్ ఎవెన్యూ కోర్టులో హాజరుపరిచి జ్యూడిషియల్ రిమాండ్ కోరే అవకాశం ఉంది. ఆ తర్వాత ఆమెను విచారించేందుకు కస్టడీ కోరవచ్చు.
కల్వకుంట్ల కవితని అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకు వెళుతున్నప్పుడు వారి అనుమతితో ఆమె భర్త అనిల్ కుమార్, ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా ఢిల్లీ వెళ్ళారు. నేడు కేసీఆర్, కేటీఆర్ తదితరులు కూడా ఢిల్లీ చేరుకున్న తర్వాత సుప్రీంకోర్టు న్యాయవాదులతో మాట్లాడి ఆమె అరెస్టుపై అభ్యంతరం తెలుపుతూ, రౌస్ ఎవెన్యూ కోర్టు లేదా సుప్రీంకోర్టులో పిటిషన్ వేసే అవకాశం ఉంది.
ఒకవేళ వారు సుప్రీంకోర్టులో పిటిషన్ వేస్తే ఇప్పటికే ఈ కేసుని మంగళవారం సుప్రీంకోర్టు విచారణ చేపట్టనుంది కనుక అదే రోజున విచారిస్తామని చెప్పే అవకాశం ఉంది.