బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో ఈడీ అధికారులు శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి విమానంలో ఢిల్లీకి తీసుకుపోయారు. నిన్న మధ్యాహ్నం నుంచి బంజారాహిల్స్‌లోని ఆమె ఇంట్లో ఈడీ అధికారులు సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను సుమారు రెండు గంటలపాటు ప్రశ్నించిన తర్వాత అరెస్ట్ నోటీస్ చేతిలో పెట్టారు.
ఈ విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు, బిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ ఆమె నివాసానికి చేరుకొని, ఈడీ అధికారులతో చాలా సేపు వాగ్వాదం చేశారు. సుప్రీంకోర్టు తీర్పు వెలువడే వరకు ఆమెను విచారించమని కోర్టుకు హామీ ఇచ్చి ఇప్పుడు హటాత్తుగా అరెస్ట్ ఎందుకు చేస్తున్నారని నిలదీశారు.
ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ శ్రేణులు కూడా పెద్ద ఎత్తున ఆమె నివాసం వద్దకు చేరుకొని నిరసనలు వ్యక్తం చేశారు.
హరీష్ రావు మీడియాతో మాట్లాడుతూ, “ఈడీ అధికారులు ఆమెను అరెస్ట్ చేసేందుకు పక్కా ప్లాన్‌తోనే శుక్రవారం మధ్యాహ్నం వచ్చారు. సోదాల పేరుతో సాయంత్రం వరకు గడిపి, కోర్టు పనివేళలు ముగిసిన తర్వాత ఆమెను అరెస్ట్ చేస్తున్నట్లు ప్రకటించారు. శని, ఆదివారం కోర్టుకి సెలవు కనుకనే శుక్రవారం సాయంత్రం అరెస్ట్ చేసి, ఆమె తరపు న్యాయవాదులు కోర్టుకువెళ్ళే అవకాశం లేకుండా ముందు జాగ్రత్త పడ్డారు.
లోక్‌సభ ఎన్నికలకు ముందు మా పార్టీ నేతని అరెస్ట్ చేసి మాపై రాజకీయంగా ఒత్తిడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వమే ఈ కుట్ర చేసిందని భావిస్తున్నాము. కానీ మేము ఈ తాటాకు చప్పుళ్ళకు భయపడబోము. మాకు పోరాటాలు కొత్త కాదు. రేపటి నుంచి రాష్ట్ర వ్యాప్తంగా కల్వకుంట్ల కవిత అరెస్టుకు నిరసనగా మా పార్టీ ఆందోళనలు చేపడుతుంది. ఆమె తరపున మేము న్యాయపోరాటం చేస్తాము,” అని హరీష్ రావు అన్నారు.
ఈడీ అధికారులు కల్వకుంట్ల కవితని వెంటబెట్టుకొని నిన్న రాత్రి 11.30 గంటలకు ఢిల్లీ విమానాశ్రయం చేరుకున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆమెను తమ కార్యాలయానికి తీసుకు వెళ్ళి రాత్రి అక్కడే ఉంచారు. ముందస్తు జాగ్రత్తగా ఢిల్లీ, హైదరాబాద్‌లోని ఈడీ కార్యాలయాల వద్ద భారీగా పోలీసులను మోహరించారు. కల్వకుంట్ల కవితతో పాటు ఆమె తరపు న్యాయవాది మోహిత్ రావు కూడా ఢిల్లీ వెళ్ళారు.