తృణమూల్ కాంగ్రెస్ అధినేత్రి, పశ్చిమ బెంగాల్ సిఎం మమతా బెనర్జీకి నుదుటన గాయమై రక్తం కారుతున్న పరిస్థితిలో ఆమె భద్రతా సిబ్బంది గురువారం సాయంత్రం కోల్‌కతా, ఎస్‌ఎస్‌కెఎం హాస్పిటల్‌కు తీసుకువచ్చి చేర్చడం ఆ రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది.
చిట్లిన ఆమె నుదురు, ముక్కుకి వైద్యులు కుట్లు వేసి చికిత్స చేశారు. తర్వాత షుగర్, బీపీ, తదితర పరీక్షలు చేశారు. నిన్న రాత్రి వరకు ఆమెకు అన్ని పరీక్షలు చేసి చికిత్స చేసిన తర్వాత ఆమె నివాసానికి తరలించి అక్కడే వైద్య బృందం అవసరమైన వైద్య సేవలు అందిస్తోంది.
మమతా బెనర్జీ గురువారం సాయంత్రం దక్షిణ కోల్‌కతాలోని ఖాళీఘాట్ వద్ద గల తన నివాసం నుంచి బయటకు వస్తుండగా కళ్ళు తిరిగి పడిపోయిన్నప్పుడు ఈ గాయాలు అయిన్నట్లు భద్రత సిబ్బంది చెపుతున్నారు. అయితే ఆమెకు అయిన గాయాలు చూస్తే వెనుక నుంచి ఎవరో తోస్తే కింద పడినప్పుడు తగిలిన గాయల్లా ఉన్నాయని హస్ డైరెక్టర్ డాక్టర్ మణిమోయ్ బందోపాద్యాయ చెప్పిన మాటలు కలకలం సృష్టిస్తున్నాయి.
ముఖ్యమంత్రి చుట్టూ పటిష్టమైన భద్రత ఉండగా ఆమెను ఎవరు వెనక నుంచి తోసే అవకాశం, సాహసం చేయగలరని అందరూ ప్రశ్నిస్తుండటంతో డాక్టర్ మణిమోయ్ మళ్ళీ స్పందిస్తూ, ఆవిదంగా పడితే అటువంటి దెబ్బలు తగులుతాయని చెప్పడమే నా ఉద్దేశ్యం తప్ప ముఖ్యమంత్రిని ఎవరో వెనక నుంచి తోశారని చెప్పడం నా ఉద్దేశ్యం కాదంటూ వివరణ ఇచ్చుకున్నారు.
ముఖ్యమంత్రి మమతా బెనర్జీ గాయపడి రక్తం కారుతున్న ఆమె ఫోటోని ఎవరో సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో వైరల్ అయ్యింది.
ప్రస్తుతం ఆమె ఆరోగ్యం నిలకడగానే ఉందని ఆమెకు వైద్య సేవలు అందిస్తున్న వైద్యులు చెప్పారు. ఒకటి రెండు రోజులలో ఆమె మళ్ళీ ప్రజల మద్యకు వచ్చే అవకాశం ఉంది.