జనసేన పోలిటికల్ యాడ్... టీజర్‌ మాత్రమే!

ఏపీలో అధికార వైసీపి ఒక్కటీ ఒక్కవైపు, టిడిపి, జనసేన, బీజేపీ మూడు మరోవైపు నిలిచి శాసనసభ, లోక్‌సభ ఎన్నికలలో పోరాడబోతున్నాయి. ఇప్పటికే టిడిపి, జనసేన, వైసీపిలు కొంతమంది అభ్యర్ధులను కూడా ప్రకటించేసి యుద్ధానికి సిద్దం అంటున్నాయి. ఈ సమయంలో బుధవారం జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆ పార్టీ ఒక వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. 

అది చూస్తే ఓ భారీ బడ్జెట్‌ సినిమా టీజర్‌కు ఏ మాత్రం తీసిపోన్నట్లు ఉంది. గత ఎన్నికలలో నన్ను నమ్మండి అంటూ జగన్మోహన్‌ రెడ్డి వాయిస్ ఓవర్‌తో ప్రారంభమయిన ఆ వీడియోలో, ముఖ్యమంత్రి గదిలో (వైసీపి ఎన్నికల గుర్తు) ఫ్యాన్ ఆన్‌ చేయగానే టేబిల్ మీద ఉన్న కాగితాలన్నీ గాలికి ఎగిరి చిందరవందరగా పడిపోతాయి. ఆ కాగితాలలో వ్యవసాయం, పరిశ్రమలు, ఉద్యోగ కల్పన వంటి హామీలు వ్రాసి ఉంటాయి. 

అప్పుడు ‘సుజలా సుఫలాం... “ అంటూ వందేమాతరం గీతంలో బ్యాక్ గ్రౌండ్‌లో వినిపిస్తుండగా పవన్‌ కళ్యాణ్‌ ఆ గదిలోకి ప్రవేశించి కిందపడుతున్న ఆ కాగితాలన్నిటినీ ఏరి టేబిల్ మీద పెట్టి, మళ్ళీ అవి గాలికి ఎగిరిపోకుండా దానిపై గాజు గ్లాసు (జనసేన ఎన్నికల గుర్తు)ని పెట్టి ముఖ్యమంత్రి కుర్చీ పక్కన నిలబడిన్నట్లు చూపారు. టేబిల్ మీద టిడిపి, బీజేపీ లోగో కలిగిన మెమొంటోని చూపుతారు. పవన్‌ కళ్యాణ్‌ సినీ పరిశ్రమలో ఉండటం వలన ఇంత చక్కటి ప్రమో వీడియో తయారు చేయించిన్నట్లు భావించవచ్చు.