లోక్సభ ఎన్నికలలో తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ అభ్యర్ధుల జాబితాలో మహబూబ్ నగర్ నుంచి డికె అరుణ పేరు ఉండటం అక్కడ నుంచి పోటీ చేయాలనుకున్న మాజీ ఎంపీ జితేందర్ రెడ్డి, అనుచరులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. ఇది సహజమే.
కానీ బీజేపీ నేతకు టికెట్ రాకపోతే కాంగ్రెస్ ముఖ్యమంత్రి వెళ్ళి ఓదార్చడమే అందరినీ ఆలోచింపజేస్తోంది. ఈరోజు ఉదయం ఈ వార్త చూడగానే సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డితో కలిసి జితేందర్ రెడ్డి ఇంటికి వెళ్ళి పరామర్శించారు. ఆయనను కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించేందుకే అని అర్దమవుతూనే ఉంది.
అనంతరం జితేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “నేను చాలా కాలంగా మహబూబ్ నగర్ జిల్లా అభివృద్ధి కోసం పనిచేస్తూ ఈ నియోజకవర్గానికే పరిమితమైపోయాను. కనుక మా అధిష్టానం నాకు తప్పకుండా ఎంపీ టికెట్ ఇస్తుందని ఆశించాను. కానీ ఇవ్వకపోవడంతో అసంతృప్తి చెందిన మాట వాస్తవం.
సిఎం రేవంత్ రెడ్డి నాకు తమ్ముడు లాంటివాడు. ఆయనతో చాలా కాలంగా మంచి స్నేహం, అనుబంధం ఉంది. అందుకే నాకు టికెట్ రాలేదని తెలిసి ఆయన నన్ను పరామర్శించేందుకు వచ్చారు. ఆయన మా ఇంటికి ఎప్పుడైనా వస్తుంటారు.
ఇప్పుడూ ఆలాగే వచ్చి వెళ్లారు తప్ప మీరందరూ అనుకుంటునట్లు నన్ను కాంగ్రెస్ పార్టీలో చేరమని అడిగేందుకు కాదు. అసలు ఆ ప్రస్తావనే రాలేదు. నేను బీజేపీలోనే ఉంటాను. నా భవిష్య కార్యాచరణ ఏమిటో మా అధిష్టానమే నిర్ణయిస్తుంది. నేను కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నానని మీరు ఊహించుకుంటే నేనేమీ చేయలేను,” అని జితేందర్ రెడ్డి అన్నారు.