కేంద్ర ఎన్నికల సంఘం కమీషనర్ల పేర్లు ఖరారు

కేంద్ర ఎన్నికల కమీషన్‌లో ప్రధాన కమీషనర్‌తో కలిపి మొత్తం ముగ్గురు కమీషనర్లు ఉంటారు. వారిలో ఒకరైన అనూప్ చంద్ర పాండే ఫిబ్రవరిలో పదవీ విరమణ చేయగా, మరొకరు అరుణ్ గోయల్ కొన్ని రోజుల క్రితమే హటాత్తుగా తన పదవికి రాజీనామా చేశారు. 

నేడో రేపో నాలుగు రాష్ట్రాల శాసనసభ, లోక్‌సభ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాల్సిన సమయంలో కేంద్ర ఎన్నికల కమీషన్‌లో ఎన్నికల ప్రధాన కమీషనర్‌ ఒక్కరే ఉండటంతో అత్యవసరంగా ఖాళీ అయిన రెండు కమీషనర్‌ పదవులను భర్తీ చేయాల్సి వచ్చింది.  

ఈ నేపధ్యంలో ప్రధాని నరేంద్రమోడీ నేతృత్వంలోని ఎన్నికల కమీషనర్ల నియామక కమిటీ అత్యవసరంగా గురువారం సమావేశమైంది. దీనిలో పాల్గొన్న కాంగ్రెస్‌ నేత ఆధీర్ రంజన్ చౌదరి సమావేశం నుంచి బయటకు రాగానే అనధికారికంగా ఇద్దరు కొత్త కమీషనర్ల పేర్లను బయటపెట్టేశారు. 

వారిలో ఒక పంజాబ్‌కు చెందిన సుఖ్ బీర్ సింగ్‌ సంధూ కాగా మరొకరు కేరళ రాష్ట్రానికి చెందిన జ్ఞానేశ్ కుమార్‌ అని చెప్పేశారు. 

కాంగ్రెస్‌ నేత ఆధీర్ రంజన్ చౌదరి ఢిల్లీలో మీడియాతో మాట్లాడుతూ, “నాకు 212 పేర్లతో కూడిన ఓ పెద్ద జాబితాను నాకు పంపారు. వారి పూర్తి వివరాలు తెలుసుకొనేందుకు తగినంత సమయం కూడా ఇవ్వలేదు. ఇవాళ్ళ సమావేశానికి రావలసిందిగా ఆహ్వానిస్తే వెళ్ళాను. మెజార్టీ సభ్యులు కేంద్ర ప్రభుత్వానికి చెందినవారే కనుక నేను సమావేశానికి హాజరయ్యే సరికే వారు ఇంచుమించు ఇద్దరి పేర్లు ఖరారు చేశారు. 

కానీ లాంఛనం కోసం ఓ పది పేర్లు చదివి వినిపించి, ముందుగా అనుకున్న వారిద్దరి పేర్లనే ఖరారు చేసేశారు. దేశ భవిష్యత్‌ని ప్రభావితం చేసే కేంద్ర ఎన్నికల కమీషన్‌లో కమీషనర్ల నియామకాన్ని రాజకీయ కోణంలో నుంచి చూడటాన్ని నేను సమర్ధించలేను. ముఖ్యంగా ఈ కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించడాన్ని నేను ఎంత మాత్రం సమర్ధించను,” అని అన్నారు.