మూడు నెలలకే తెలంగాణ పరిస్థితి ఇలా మారితే....

మంగళవారం కరీంనగర్‌ కధన భేరి సభలో పాల్గొన్న మాజీ సిఎం కేసీఆర్‌ కాంగ్రెస్‌ ప్రభుత్వం, సిఎం రేవంత్‌ రెడ్డి భాషపై సునిశిత విమర్శలు చేశారు. 

కాంగ్రెస్ పార్టీ చేతికి రాష్ట్రాన్ని అప్పగిస్తే ఏమవుతుందో నేను ఆనాడే చెప్పాను. ఇప్పుడు అదే జరుగుతోంది. ప్రజలు కాంగ్రెస్‌ మాయ మాటలు నమ్మి, అత్యాశకు పోయి రాష్ట్రాన్ని దాని చేతిలో పెట్టారు. అది అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే రాష్ట్రంలో కరెంట్ కోతలు మొదలయ్యాయి. రైతులకు నీళ్లు బంద్ అయ్యాయి. 

ఆరు గ్యారెంటీలు వాటిలో 420 హామీల గురించి అడిగితే ఓ మంత్రి చెప్పుతో కొడతానంటాడు. ముఖ్యమంత్రి పేగులు మెళ్ళో వేసుకుంటా... పండవెట్టి తొక్కుతా… మానవ బాంబునవుతానంటూ నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతాడు. ముఖ్యమంత్రి హోదాలో ఉండే వ్యక్తి మాట్లాడే మాటలేనా ఇవి?

తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణని వ్యతిరేకిస్తున్నవారిని ఉద్దేశ్యించి నేను చాలా కరుకుగా మాట్లాడాను. కానీ ముఖ్యమంత్రిగా ఉండగా ఒక్కసారి అయినా దద్దమలు, సన్నాసులని ఎవరినైనా అన్నానా?

ఆంద్రావాళ్ళు మనల్ని మోసం చేసి పోయారు... ఖజానా ఖాళీ అని నేను ఎప్పుడైనా అన్నానా? కానీ ఈ ముఖ్యమంత్రి వస్తూనే సచివాలయంలో, ప్రగతిభవన్‌లో లంకె బిందెలు దొరుకుతాయని అనుకోని దేవులాడానన్నాడు. 

మాకు ఆనాడు తెలంగాణ ఎలా చేతికి వచ్చిందో అలాగే స్వీకరించి అభివృద్ధి చేసి చూపించాము. అయినా ప్రజలు మమ్మల్ని కాదని రాష్ట్రాన్ని మీ చేతిలో పెట్టారు కనుక దమ్ముంటే మాకంటే గొప్పగా అభివృద్ధి చేసి ప్రజలకు చూపించుకో... చెప్పుకో అంతే కానీ పాలన చాతకాక  మా మీద బట్టకాల్చి వేస్తామంటే చేతులు ముడుచుకొని కూర్చోము. 

ఇలాగే పాలన సాగితే తెలంగాణ పరిస్థితి మళ్ళీ మొదటికి రావడానికి ఎంతో సమయం పట్టదు. అప్పుడు ప్రజలే ఈ కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినవిదంగా బుద్ధి చెపుతారు,” అని కేసీఆర్‌ అన్నారు.