తెలంగాణలో 16 కుల కార్పొరేషన్లకు ఆమోద ముద్ర

తెలంగాణ సిఎం రేవంత్‌ రెడ్డి అధ్యక్షతన మంగళవారం సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో 16 కులాలకు వేర్వేరుగా కార్పొరేషన్లు ఏర్పాటు చేసేందుకు ఆమోదముద్ర వేసింది. అవి: మాదిగ, మాదిగ ఉపకుల, మాల, మాల ఉపకుల, సంత్ సేవలాల్ లంబాడీ, కుమురం భీమ్ ఆదివాసీ, ఏకలవ్య, మేర, గంగపుత్ర, యాదవ కూర్మ, ముదిరాజ్‌, లింగాయత్, పెరిక (పురగరి క్షత్రియ), మున్నూరు కాపు, ఆర్య వైశ్య, రెడ్డి, మరియు ఉపకులాల కార్పొరేషన్లు. వీటితో బాటు ఈబీసీ (ఆర్ధికంగా వెనుకబడిన తరగతులు)కు ప్రత్యేక సంక్షేమ బోర్డు ఏర్పాటు చేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

మంత్రివర్గం ఆమోదించిన ఇతర ప్రతిపాదనలు:

1. ఉమ్మడి మహబూబ్ నగర్‌ జిల్లాలోని నారాయనపేట, కొడంగల్‌, మక్తల్ నియోజకవర్గాలలో లక్ష ఎకరాలకు సాగునీరు అందించేందుకు రోపో.2,945 కోట్ల వ్యయంతో నారాయణ పేట- కొడంగల్‌ ఎత్తిపోతల ప్రాజెక్టు నిర్మాణానికి ఆమోదం. 

2. శేరిలింగంపల్లి మండలంలోని సాయి సింధూ ఫౌండేషన్ అధ్వర్యంలో నడుస్తున్న క్యాన్సర్ ఆసుపత్రికి గత ప్రభుత్వం కేటాయించిన 15 ఎకరాల భూమి లీజుని మరో 30 ఏళ్ళు పొడిగిస్తూ, లీజు మొత్తాన్ని రూ.2లక్షల నుంచి కోటి రూపాయలకు పెంచాలని మంత్రివర్గం నిర్ణయించింది. 

3. బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రికి కేటాయించిన భూమి లీజుని మరో 30 ఏళ్ళు పొడిగించింది. 

4. ఇందిరమ్మ ఇళ్ళు పధకానికి మంత్రివర్గం చట్టబద్దత కల్పించింది. ఈ పధకం కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.22,500 కోట్లు కేటాయించాలని నిర్ణయించింది.  

5. రాష్ట్రంలో కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకొని స్వయం ఉపాధి పొందుతున్న మహిళలకు సాయపడేందుకు ‘మహిళా శక్తి’ పేరిట ఓ పధకాన్ని అమలుచేసేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. వారు తమ పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు ఔటర్ రింగ్ రోడ్డు చుట్టూ 25-30 ఎకరాలలో వారికి స్థలాలు కేటాయించాలని, వారి ఉత్పత్తులకు బ్రాండింగ్, మార్కెటింగ్ సదుపాయాలు కల్పించాలని మంత్రివర్గం నిర్ణయించింది.