తెలంగాణ ప్రభుత్వం అభ్యర్ధన మేరకు ‘టిఎస్’కి బదులు ‘టిజి’తో వాహనాలను రిజిస్ట్రేషన్స్ చేసేందుకు కేంద్ర రవాణాశాఖ ఆమోదిస్తూ, ఈ మేరకు మంగళవారం ఓ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసింది. కనుక ఇక నుంచి తెలంగాణలో కొత్త వాహనాలకు ‘టిఎస్’కి బదులు ‘టిజి’తో రిజిస్ట్రేషన్స్ జరుగబోతున్నాయి.
తెలంగాణ ఏర్పాటు తర్వాత అధికారంలోకి వచ్చిన టిఆర్ఎస్ పార్టీ ‘తెలంగాణ స్టేట్’ని సూచించేందుకు వాహనాలకు ‘టిఎస్’ని ఎంచుకోగా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అయితే అది ప్రజలకు ‘టిఆర్ఎస్’ పార్టీని గుర్తుచేస్తున్నట్లు ఉందని కాంగ్రెస్ నేతలు వాదించేవారు. కనుక తాము రాష్ట్రంలో అధికారంలోకి వస్తే ‘టిఎస్’ని ‘టిజి’ (తెలంగాణ గవర్నమెంట్)గా మారుస్తామని పిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి చాలాసార్లు చెప్పారు. చెప్పిన్నట్లుగానే ముఖ్యమంత్రి కాగానే శాసనసభలో దీని కోసం తీర్మానం చేసి కేంద్రానికి పంపారు. సిఎం రేవంత్ రెడ్డి కేంద్రం పట్ల సఖ్యతగా, వినయంగా మెసులుకుంటుండటంతో ఆ ప్రతిపాదనకు వెంటనే ఆమోదం తెలిపింది.
అయితే రాష్ట్రంలో ‘టిఎస్’తో రిజిస్ట్రేషన్ అయిన పాత వాహనాలకు ఈ మార్పు వర్తించదు. వాటి ‘టిఎస్’ రిజిస్ట్రేషన్లు యదాతధంగా కొనసాగుతాయి. ఇకపై కొత్తగా రిజిస్ట్రేషన్ జరిగే వాహనాలకు మాత్రమే ‘టిజి’తో నంబర్ కేటాయించబడుతుంది.