తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి సోమవారం ఒకే రోజున యాదాద్రి, భద్రాద్రి ఆలయాలను సందర్శించారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా మణుగూరులో ప్రజా దీవెన సభలో సిఎం రేవంత్ రెడ్డి మళ్ళీ మరోసారి బిఆర్ఎస్ పార్టీని తమ జోలికి రావద్దని హెచ్చరించారు.
“బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలు కలిసి మా ప్రభుత్వాన్ని కూలద్రోయాలని కుట్రలు చేస్తున్నాయి. మా జోలికి రావద్దు... మాతో పెట్టుకోవద్దని కేసీఆర్‌ని హెచ్చరిస్తున్నాను. ఎక్కడ గుచ్చితే ఎక్కడ దిగుతుందో నాకు బాగా తెలుసు. మమ్మల్ని గోకాలని ప్రయత్నించవద్దు. మా ప్రభుత్వానికి అండగా ఉండేందుకు మీ పార్టీలో చాలా మంది ఎమ్మెల్యేలు సిద్దంగా ఉనారు. మేము కాంగ్రెస్ గేటు తెరిచామంటే బిఆర్ఎస్ పార్టీ ఖాళీ అయిపోతుంది. అప్పుడు పార్టీలో తండ్రీ కొడుకులు, మేనల్లుడు తప్ప ఎవరూ మిగలరు.
లోక్‌సభ ఎన్నికల తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండదని, రాష్ట్రంలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేత కె లక్ష్మణ్ అన్నారు. కేవలం 8 మంది ఎమ్మెల్యేలున్న బీజేపీ అధికారంలోకి వస్తామని ఎలా చెపుతోంది?అంటే బిఆర్ఎస్ పార్టీతో కలిసి కుట్రలులు చేస్తోందని అర్దమవుతోంది.
రెండు పార్టీలు కుమక్కు అయినందునే, లోక్‌సభ ఎన్నికలకు బీజేపీ ప్రకటించిన స్థానాలలో బిఆర్ఎస్ అభ్యర్ధులను ప్రకటించలేదు. అలాగే బిఆర్ఎస్ ప్రకటించిన చోట బీజేపీ ప్రకటించలేదు. మీ కుమ్మక్కు రాజకీయాలు ప్రజలు కూడా చూస్తూనే ఉన్నారు. శాసనసభ ఎన్నికలలో ఓసారి బుద్ధి చెప్పినా రెండు పార్టీల తీరు మారలేదు. కనుక లోక్‌సభ ఎన్నికలలో మరోసారి ప్రజలే బుద్ధి చెపుతారు.
కాంగ్రెస్ పార్టీ ఎన్నికలలో ప్రజలకు ఇచ్చిన వాగ్ధానాలను మా ప్రభుత్వం అమలుచేస్తుంటే, కేటీఆర్ హామీలు అమలుచేయడం లేదంటూ వితండవాదం చేస్తున్నారు. నేడు మరో హామీ ‘ఇందిరమ్మ ఇళ్ళ’ పధకాన్ని కూడా ఇక్కడ నుంచే ప్రారంభిస్తున్నాము. మీరు పేదలనదరికీ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు ఇస్తామని మభ్యపెడుతూ పదేళ్ళు కాలక్షేపం చేసి దిగిపోయారు. కానీ మేము అధికారంలోకి వచ్చిన మూడు నెలల్లోనే ఇందిరమ్మ ఇళ్ళు పధకాన్ని ప్రారంభించాము,” అని సిఎం రేవంత్ రెడ్డి అన్నారు.
ఈ కార్యక్రమంలో సిఎం రేవంత్ రెడ్డితో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, గృహ నిర్మాణ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి తదితరులు పాల్గొని, లోక్‌సభ ఎన్నికలలో కాంగ్రెస్ అభ్యర్ధులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.