కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేస్తాం... పేల్చేస్తాం అంటున్న బిఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికలకు ముందు వరుసపెట్టి షాకులు తగులుతూనే ఉన్నాయి. ఇప్పటికే ముగ్గురు ఎంపీలు గుడ్ బై చెప్పేసి వెళ్ళిపోగా, ఇప్పుడు మహబూబాబాద్ మాజీ ఎంపీ ప్రొఫెసర్ సీతారాం నాయక్ కూడా బిఆర్ఎస్ని వీడి బీజేపీలో చేరిపోయేందుకు సిద్దపడుతున్నారు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటిస్తున్న కేంద్రమంత్రి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి హనుమకొండలోని సీతారాం నాయక్ ఇంటికి వెళ్ళి బీజేపీలో చేరవలసిందిగా ఆహ్వానించగా, ఆయన సానుకూలంగా స్పందించిన్నట్లు తెలుస్తోంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “పార్టీలో నాకు తగిన ప్రాధాన్యత లభించడం లేదనేది వాస్తవం. కనుక నేను అసంతృప్తిగా ఉన్నమాట కూడా వాస్తవమే. కానీ బిఆర్ఎస్ అధిష్టానాన్ని విమర్శించను. పార్టీలో నాకు గౌరవం లభించనప్పుడు ఇంకా కొనసాగవలసిన అవసరం లేదు. కిషన్ రెడ్డి నన్ను బీజేపీలో చేరవలసిందిగా కోరారు. నా అనుచరులతో మాట్లాడిన తర్వాత వారి అభిప్రాయం మేరకు తగిన నిర్ణయం తీసుకుంటాను. గిరిజనులకు ప్రత్యేకంగా యూనివర్సిటీ కావాలనే నా విజ్ఞప్తులను కేంద్ర ప్రభుత్వం గౌరవించి, ములుగు జిల్లాలో ట్రైబల్ యూనివర్సిటీకి తాత్కాలిక భవనం ప్రారంభించినందుకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు.