ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత భారత జాగృతి సభ్యులతో కలిసి హైదరాబాద్‌లో ధర్నాచౌక్ వద్ద ధర్నా చేశారు.
ప్రభుత్వోద్యోగాల భర్తీలో మహిళలకు 33శాతం రిజర్వేషన్లు ఉండగా, కాంగ్రెస్ ప్రభుత్వం మహిళా అభ్యర్ధులకు రోస్టర్ పాయింట్ మార్క్ చేయకుండా ఓపెన్, రిజర్వ్ కేటగిరిలలో 33 శాతం రిజర్వేషన్లు అమలుచేయాలని ఆదేశిస్తూ ఫిబ్రవరి 8వ తేదీన సిఎస్ శాంతికుమారి జీవో నం:3 జారీ చేశారు.
దీని వలన మహిళలకు అన్యాయం జరుగుతుందని కనుక తక్షణం ఆ జీవో ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కల్వకుంట్ల కవిత ధర్నా చేస్తున్నారు. బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, మాగంటి గోపీనాధ్ తదితరులు వచ్చి ఆమెకు సంఘీభావం తెలిపారు.
ఈ సందర్భంగా కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడుతూ, “ఆనాడు పీవీ నరసింహారావు మహిళలకు 33% రిజర్వేషన్లు అమలుచేయగా, మళ్ళీ కేసీఆర్ అమలుచేశారు. వాటిని యధాతధంగా అమలుచేయాల్సిన కాంగ్రెస్ ప్రభుత్వం జీవో నం:3జారీ చేసి మహిళలకు అన్యాయం చేస్తోంది. రేవంత్ రెడ్డికి ఎంతసేపు తన ఓటుకి నోటు కేసు నుంచి ఏవిదంగా బయటపడాలనే ఆలోచనే తప్ప మహిళలకు న్యాయం చేయాలని ఉండదు,” అని అన్నారు.