కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో భాగంగా ఇందిరమ్మ ఇళ్ళు పధకం కూడా ఒకటి. ఈ పధకంలో భాగంగా ఒక్కో నియోజకవర్గంలో 3,500 ఇళ్ళు చొప్పున 119 నియోజకవర్గాలలో ఏటా 4,16,500 ఇళ్ళు నిర్మించి లబ్ధిదారులకు అందించాలని నిర్ణయించింది. అదనంగా మరో 33,500 ఇళ్ళు నిర్మించి వాటిని ముఖ్యమంత్రి కోటాలో రిజర్వ్ చేసి ఉంచాలని నిర్ణయించింది.
ఈ నెల 11న సిఎం రేవంత్ రెడ్డి భద్రాచలంలో ఈ పధకాన్ని లాంఛనంగా ప్రారంభించబోతున్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబందించి మార్గదర్శకాలను విడుదల చేసింది. ఆ వివరాలు:
• ఈ పధకంలో ఎంపికైన లబ్ధిదారులకు నాలుగు వాయిదాలలో నిధులు అందిస్తుంది. బేస్ మెంట్, శ్లాబ్ పనులు మొదలు పెట్టిన్నప్పుడు ఒక్కో లక్ష, శ్లాబ్ పని పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు, ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత రూ.2 లక్షలు కలిపి మొత్తం రూ.6 లక్షలు అందిస్తుంది.
• ఆహార భద్రత కార్డులు కలిగిన బీపీఎల్ కుటుంబాలు ఇందుకు అర్హులు.
• లబ్ధిదారునికి సొంత స్థలం లేదా ప్రభుత్వ ఇచ్చిన స్థలం ఉండాలి. దానిలో కనీసం చిన్న గుడిసె వేసుకొని నివసిస్తున్నవారు ఈ పధకానికి అర్హులు.
• ఒంటరి, వితంతు మహిళలు ఈ పధకానికి అర్హులే.
• లబ్దిదారులను గ్రామ సభలలో ఎంపిక చేస్తారు. జిల్లా అధికారులు పరిశీలించిన తర్వాత జిల్లా కలెక్టర్ ఆమోదిస్తారు.
• ఇంటి ఇల్లాలు, ఒంటరి మహిళ, వితంతు మహిళల పేరు మీద ఈ పధకాన్ని మంజూరు చేసి, వారి బ్యాంక్ అకౌంట్లలోనే నేరుగా డబ్బు జమా చేస్తారు. ఇంటి నిర్మాణం పూర్తయిన తర్వాత వారి పేరిటే యాజమాన్య హక్కు పత్రాలను జిల్లా అధికారులు అందజేచేస్తారు.
• గ్రామ, వార్డు సభల్లో ఆమోదం పొందిన తర్వాతే లబ్ధిదారులను కలెక్టర్ ఎంపిక చేస్తారు.
• ఇందిరమ్మ ఇళ్ళు కనీసం 400 చ.అడుగుల విస్తీర్ణంలో వంటగది, పడకగది, బాత్రూం ఉండేలా ఆర్సీసీ రూఫ్తో మాత్రమే నిర్మించాలి.
• లబ్ధిదారుల ఎంపిక సమయంలో, తర్వాత, ఇళ్ళ నిర్మాణాలు జరుగుతున్నప్పుడు సంబంధిత అధికారులు వచ్చి పర్యవేక్షిస్తుంటారు. ఎక్కడైనా సమస్యలు, లోపాలు, అవకతవకలు ఉన్నట్లు గుర్తిస్తే వారు తగు చర్యలు తీసుకొంటూ ఇళ్ళ నిర్మాణం వేగంగా పూర్తి చేసేందుకు లబ్ధిదారులకు సాయపడతారు.