సాధారణంగా ఏ రాష్ట్రంలోనైనా ప్రతిపక్షాలు అధికార పార్టీపై పోరాడుతుంటాయి కానీ మన రాష్ట్రంలో వాటిలో అవే పోరాడుకొంటున్నాయి. ప్రస్తుతం కాంగ్రెస్, భాజపా నేతలు ‘ఎవరు డిల్లీ స్థాయి నేతలు..ఎవరు గల్లీ స్థాయి నేతలు’ అనే ఒక అనవసరమైన అంశంపై పోరాడుకొంటున్నారు. కాంగ్రెస్ పార్టీ స్వాతంత్ర్య సమరయోదులు అందరినీ పక్కనబెట్టి గాంధీ, నెహ్రూల భజనే చేస్తుంటుందని భాజపా నేతల ఆరోపిస్తుంటారు. ప్రముఖ స్వాతంత్ర్య సమరయోధుడు, మొట్టమొదటి హోంమంత్రి సర్దార్ వల్లబ్ బాయ్ పటేల్ వల్లనే దేశం సమైక్యంగా నిలిచి ఉందని, కానీ ఆనాడు నెహ్రూ కాశ్మీర్ సమస్యని ఐక్యరాజ్యసమితికి నివేదించిన కారణంగా నేటికీ కాశ్మీర్ రావణకాష్టంలాగా రగులుతోందని భాజపా నేతలు ఆరోపిస్తుంటారు.
కాంగ్రెస్ పార్టీ సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్ కి ప్రాధాన్యత ఈయలేదని భాజపా జాతీయ అధ్యక్షుడు అమిత్ షా అభిప్రాయపడ్డారు. అది నిజం కూడా. దేశంలో లేదా ఏ రాష్ట్రంలోనైనా కాంగ్రెస్ పాలన మొదలైతే గాంధీ, నెహ్రుల భజనే వినపడుతుంటుంది. అది వారితో మొదలై సోనియా, రాహుల్ గాంధీల దగ్గర ముగుస్తుంటుంది. ఈ సంగతి దేశ ప్రజలందరికీ తెలుసు. రాజ్యసభ సభ్యుడు వి.హనుమంత రావు వంటి వీరవిధేయ కాంగ్రెస్ భక్తులైతే సోనియాగాంధీ నామస్మరణ చేయకుండా నాలుగు ముక్కలు మాట్లాడలేరు. కనుక ఆ పార్టీ గురించి అమిత్ షా వ్యక్తం చేసిన అభిప్రాయం సరైనదేనని భావించవచ్చు. అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ఆయన వ్యాఖ్యలని జీర్ణించుకోలేకపోవడం కూడా సహజమే. కనుక జైపాల్ రెడ్డి ఘాటుగా స్పందించారు.
అమిత్ షా ఒక గల్లీ స్థాయి నాయకుడు మాత్రమేనని ఆయనకి నెహ్రు గురించి మాట్లాడే అర్హత లేదని అన్నారు. ప్రత్యర్ధి పార్టీ వాళ్ళు తమ జాతీయ అధ్యక్షుడుని అంత మాట అనేస్తే భాజపా నేతలు వినబడనట్లు ఊరుకో(లే)రు కనుక రాష్ట్ర భాజపా అధ్యక్షుడు డా.లక్ష్మణ్ కూడా అంతే ఘాటుగా జవాబిచ్చారు.
అమిత్ షా గురించి మాట్లాడే అర్హత జైపాల్ రెడ్డికి లేదని, ఆయన తన స్థాయి తెలుసుకొని మాట్లాడాలని అన్నారు. కాంగ్రెస్ నేతల స్థాయి ఏమిటో ప్రజలకి తెలుసునని అందుకే వారిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచారని అన్నారు. కాంగ్రెస్ పార్టీ గాంధీ, నెహ్రులకే ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చింది తప్ప సుభాస్ చంద్రబోస్, సర్దార్ వల్లబ్ భాయ్ పటేల్, డా.అంబేద్కర్, పివి.నరసింహరావు వంటి మహనీయులని పెద్దగా పట్టించుకొని మాట వాస్తవం కాదా? అని ప్రశ్నించారు.
అయితే కాంగ్రెస్, భాజపా నేతలు నిజంగా ఆ మహనీయుల కోసమే పోరాడుకొంటున్నారా? అంటే కాదనే చెప్పవచ్చు. ఏదో ఒక అంశం పట్టుకొని మీడియా ముందుకు వచ్చి మాట్లాడకపోతే జనాలు వాళ్ళని మరిచిపోతారు. పార్టీలో గట్టిగా మాట్లాడేవాళ్ళనే జనాలు, పార్టీ అధిష్టానం కూడా గుర్తుంచుకొంటాయి. బహుశః అందుకే ఈ కీచులాటలని చెప్పవచ్చు.