తెలంగాణ శాసనసభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ ఓడిపోయిన తర్వాత పార్టీ బలహీనంగా మారింది. ఈ పరిస్థితులలో అనూహ్యంగా బీఎస్పీ స్నేహ హస్తం అందించడం విశేషం. ఆ పార్టీ రాష్ట్ర అధినేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ మంగళవారం హైదరాబాద్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్ళి భేటీ అయ్యారు.
కేవలం మర్యాదపూర్వకంగానే కలిశామని బిఆర్ఎస్ నేతలు, ప్రవీణ్ కుమార్ చెప్పుకొన్నప్పటికీ లోక్‌సభ ఎన్నికలలో నాగర్‌కర్నూల్ నుంచి పోటీ చేయాలనుకొంటున్న ప్రవీణ్ కుమార్, బిఆర్ఎస్ పార్టీ మద్దతు కోరేందుకే భేటీ అయ్యిన్నట్లు తెలుస్తోంది.
నాగర్‌కర్నూల్ బిఆర్ఎస్ ఎంపీ పి.రాములు బీజేపీలో చేరిపోవడంతో ఆయన కుమారుడు పి. భరత్ బీజేపీ అభ్యర్ధిగా పోటీ చేయబోతున్నారు. కనుక అక్కడ ప్రవీణ్ కుమార్‌కి బిఆర్ఎస్ పార్టీ మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. అయితే ఈ పొత్తు నాగర్‌కర్నూల్‌కు మాత్రమే పరిమితం అనుకోవడానికి లేదు.
ఇందుకు ప్రతిగా రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన 16 లోక్‌సభ స్థానాలలో బిఆర్ఎస్ పార్టీకి బీఎస్పీ మద్దతు ఆశించవచ్చు. లేదా బీఎస్పీ మరికొన్ని సీట్లు ఆశించవచ్చు. కనుక బిఆర్ఎస్, బీఎస్పీల పొత్తుపై ఒకటి రెండు రోజులలో స్పష్టత రావచ్చు.
కానీ కేసీఆర్‌తో ప్రవీణ్ కుమార్ చేతులు కలిపితే, ఇంతకాలం కేసీఆర్ నిరంకుశ పాలన చేస్తున్నారని, దళితులని చులకనగా చూస్తున్నారని చేసిన వాదనలకు అర్దం ఉండదు. ప్రవీణ్ కుమార్ కూడా పదవుల కోసం ఆశపడే మరో సాధారణ రాజకీయ నాయకుడుగానే మిగిలిపోతారు.