బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్, పార్టీ కార్యక్రమాలకు నెల రోజులు దూరంగా ఉంటే, పార్టీ నేతల్లో తమ పార్టీ, తమ భవిష్యత్ పట్ల అపనమ్మకం మొదలైంది. ఒకరొకరుగా పార్టీని వీడి కాంగ్రెస్ లేదా బీజేపీలో చేరిపోతున్నారు. బిఆర్ఎస్ పార్టీకి చాలా కీలకమైన లోక్‌సభ ఎన్నికలకు ముందు ఈవిదంగా జరుగుతుండటం చాలా ఆందోళనకరమే.
వరంగల్ జిల్లా అధ్యక్షుడు, వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ పార్టీ వీడి బీజేపీలో చేరేందుకు సిద్దమయ్యారు. ఈ విషయం తెలియగానే కేసీఆర్ ఎమ్మెల్సీ బస్వరాజు సారయ్యని ఆయన వద్దకు పంపించి బుజ్జగించే ప్రయత్నం చేస్తున్నారు. కానీ రమేష్ మాత్రం పార్టీని వీడేందుకే మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తోంది.
మరో పక్క బీజేపీ నేతలు అయనతో సంప్రదింపులు జరుపుతున్నారు. వరంగల్ నుంచి లోక్‌సభకు పోటీ చేసేందుకు టికెట్ ఇస్తే బీజేపీలో చేరేందుకు సిద్దమని రమేష్ చెపుతున్నట్లు సమాచారం. వరంగల్‌కు చెందిన 15 మంది బిఆర్ఎస్ కార్పొరేటర్లు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు సిద్దంగా ఉన్నట్లు తెలుస్తోంది.