లోక్‌సభ ఎన్నికలలో పోటీ బీజేపీతోనే: కేసీఆర్‌

బిఆర్ఎస్ అధినేత కేసీఆర్‌ ఆదివారం తెలంగాణ భవన్‌లో కరీంనగర్‌ నేతలతో సమావేశమయ్యి లోక్‌సభ ఎన్నికల సన్నాహాలు గురించి చర్చించారు. ఈ సందర్భంగా ఆయన వారిని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “శాసనసభ ఎన్నికలని, ఫలితాలని పట్టించుకోకుండా అందరూ లోక్‌సభ ఎన్నికలకు కలిసికట్టుగా పనిచేయాలి. మూడు నెలల కాంగ్రెస్‌ పాలన చూసిన ప్రజలు అప్పుడే విసుగెత్తిపోయారు. ముఖ్యంగా రైతులు అప్పుడే నీళ్ళ కోసం రోడ్లెక్కుతున్నారు. బిఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడే నిశ్చింతగా ఉండేవారిమని ప్రజలు అనుకుంటున్నారు. 

ఈ ఎన్నికలలో ప్రజలు కాంగ్రెస్ పార్టీకి గట్టిగా బుద్ధి చెప్పబోతున్నారు. అందువల్ల ఈ ఎన్నికలతో మనకి బీజేపీతోనే పోటీ తప్ప కాంగ్రెస్ పార్టీతో కాదు. కనుక మనం గట్టిగా కృషి చేస్తే లోక్‌సభ ఎన్నికలలో మంచి ఫలితాలు సాధించవచ్చు. ఈ నెల 12న కరీంనగర్‌లో సభ నిర్వహించుకొని మళ్ళీ ప్రజల ముందుకు వెళ్ళి అన్ని విషయాలు వివరిద్దాము. కరీంనగర్‌ ఎంపీ సీటుని మనమే గెలుచుకోబోతున్నాము,” అని కేసీఆర్‌ అన్నారు. 

మేడిగడ్డ బ్యారేజిలో పిల్లర్లు క్రుంగిపోవడం గురించి కాంగ్రెస్‌ ప్రభుత్వం చేస్తున్న ఆరోపణలపై కేసీఆర్‌ స్పందిస్తూ, “ఇంత పెద్ద ప్రాజెక్టులలో ఇటువంటి సమస్యలు వస్తుంటాయి. వాటిని ప్రభుత్వం వెంటనే సరిచేయిస్తూ ఉండాలి. మిడ్ మానేరు ప్రాజెక్టులో సమస్య వస్తే వెంటనే పరిష్కరించి, రైతులకు సకాలంలో నీళ్ళు అందించాము. కానీ కాంగ్రెస్‌ ప్రభుత్వం మనపై బురద జల్లడానికే మేడిగడ్డ బ్యారేజిలో ఏర్పడిన లోపాన్ని భూతద్దంలో ప్రజలకు చూపిస్తూ, మరమత్తులు చేయించకుండా కాలక్షేపం చేస్తోంది. దీని వలన రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ఉంటుంది,” అని అన్నారు.