లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణ బీజేపీ అభ్యర్ధులు వీరే

త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు తెలంగాణలోని 17 ఎంపీ సీట్లకు 9 మంది అభ్యర్ధులతో బీజేపీ అధిష్టానం తొలి జాబితా ప్రకటించింది. వారి వివరాలు...

 

అభ్యర్ధి పేరు

నియోజకవర్గం

1

కిషన్ రెడ్డి

సికింద్రాబాద్‌

2

బండి సంజయ్‌

కరీంనగర్‌

3

ధర్మపురి అర్వింద్

నిజామాబాద్‌

4

ఈటల రాజేందర్‌

మల్కాజ్‌గిరి

5

కొండా విశ్వేశ్వర్ రెడ్డి

చేవెళ్ళ

6

బూర నర్సయ్య గౌడ్

భువనగిరి

7

బీబీ పాటిల్

జహీరాబాద్

8

పి. భరత్

నాగర్ కర్నూల్

9

మాధవీలత

హైదరాబాద్‌


బీజేపీ సిట్టింగ్ ఎంపీలు కిషన్ రెడ్డి, బండి సంజయ్‌, ధర్మపురి అర్వింద్ ముగ్గురికీ మళ్ళీ అవే స్థానాలు కేటాయించడం పెద్ద విశేషమేమీ కాదు. కానీ మల్కాజ్‌గిరి సీటు కోసం పార్టీలో మురళీధర్ రావు వంటి సీనియర్లు చాలా మంది పోటీ పడుతున్నా శాసనసభ ఎన్నికలలో హుజూరాబాద్‌, గజ్వేల్ రెండు చోట్ల నుంచి పోటీ చేసి ఓడిపోయిన ఈటల రాజేందర్‌కు ఆ సీటు కేటాయించడం గమనిస్తే నేటికీ బీజేపీలో ఆయన పట్టు తగ్గలేదని స్పష్టం అవుతోంది.

గెలుపు గుర్రంగా భావించబడే కొండా విశ్వేశ్వర్ రెడ్డిని చేవెళ్ళ నుంచి బరిలో దింపడం ద్వారా ఈసారి ప్రతీ ఒక్క సీటుని ఎలాగైనా కైవసం చేసుకోవాలని బీజేపీ చాలా పట్టుదలగా ఉన్నట్లు అర్దమవుతోంది.

ఇటీవలే బిఆర్ఎస్ పార్టీని వీడి బీజేపీలో చేరిన జహీరాబాద్ ఎంపీ బీబీ పాటిల్‌కు తిరిగి అదే సీటు కేటాయించగా, మరో ఎంపీ పి. రాములుకి బదులు ఆయన కుమారుడు పి.భరత్‌కు నాగర్‌కర్నూల్‌, ఎంపీ బూర నర్సయ్య గౌడ్‌కి భువనగిరి టికెట్స్ కేటాయించడం గమనిస్తే ఈసారి బిఆర్ఎస్ పార్టీకి ఎదురీత తప్పదని స్పష్టమవుతోంది.

చాలా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే, బీజేపీలో ఇంకా చేరక మునుపే మాధవీలతకు హైదరాబాద్‌ టికెట్‌ కేటాయించడం. పైగా హైదరాబాద్‌ నియోజకవర్గంలో మజ్లీస్‌, కాంగ్రెస్‌ పార్టీల నుంచి గట్టి పోటీ కూడా ఉంటుంది. అయినా కొత్త అభ్యర్ధిని నిలబెడుతుండటం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. ఆమె విరించి హాస్పిటల్స్ ఫౌందర్ ఛైర్మన్‌ విశ్వనాధ్ సతీమణి. లతమా ఫౌండేషన్ ఛైర్ పర్సన్‌గా నగరంలో పలు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తుంటారు. ఆమె ప్రముఖ భరత నాట్య కళాకారిణి కూడా.

మెదక్, నల్గొండ, ఖమ్మం, వరంగల్‌, పెద్దపల్లి, మహబూబ్ నగర్‌, ఆదిలాబాద్‌, మహబూబాబాద్ స్థానాలకు కూడా త్వరలోనే బీజేపీ అభ్యర్ధులను ప్రకటించనుంది. బీజేపీలో చేరేందుకు సిద్దంగా ఉన్న బిఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డికి నల్గొండ, ఎంపీ నామా నాగేశ్వర రావుకి ఖమ్మం టికెట్స్ కేటాయించవచ్చని సమాచారం.