బెంగళూరు కేఫ్‌లో బాంబు ప్రేలుడు... హైదరాబాద్‌లో అలర్ట్!

శుక్రవారం మధ్యాహ్నం బెంగళూరులోని రాజాజీ నగర్‌లో గల రామేశ్వరం కేఫ్‌లో బాంబు ప్రేలుడుతో యావత్ దేశం ఉలిక్కి పడింది. మోడీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి దేశంలో ఇటువంటి ఘటనలు జరుగకుండా గట్టి నిఘా పెట్టడంతో ఉగ్రవాదులు అటువంటి ప్రయత్నాలు చేయడం మానుకున్నారు. కనుక నిత్యం రద్దీగా ఉండే బెంగళూరులోని  రామేశ్వరం కేఫ్‌లో బాంబు ప్రేలుడుతో కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు అప్రమత్తమయ్యాయి. 

కర్ణాటక ముఖ్యమంత్రి సిద్దరామయ్య ఈ ప్రేలుడుని ధృవీకరించారు. పోలీసులు దర్యాప్తులో ఓ వ్యక్తి బ్యాగుతో వచ్చి క్యాష్ కౌంటర్ నుంచి భోజనానికి టోకెన్ తీసుకున్నట్లు సిసి కెమెరా రికార్డుల గుర్తించారని చెప్పారు. ఆ బ్యాగును అక్కడే వదిలేసి ఆ వ్యక్తి వెళ్ళిపోయిన తర్వాత ప్రేలుడు జరిగిన్నట్లు పోలీసులు గుర్తించారని సిఎం సిద్ద రామయ్య చెప్పారు. ఈ ప్రేలుడులో సిబ్బందితో సహా తొమ్మిదిమండి గాయపడ్డారు. అయితే విస్పోటనం తీవ్రత తక్కువగా ఉండటంతో ఎవరికీ ప్రాణాపాయం కలగలేదని చెప్పారు. 

స్థానిక పోలీసులతో పాటు బాంబ్ స్క్వాడ్, క్లూస్ టీమ్, ఎన్ఐఏ బృందాలు కూడా ఈ ప్రేలుడుకి సమబందించిన సాక్ష్యాధారాలు సేకరించి దర్యాప్తు చేస్తున్నాయి. కేంద్ర హోమ్ శాఖ ఈ ప్రేలుడుకి సంబందించి పూర్తి నివేదిక ఇవ్వాలని రాష్ట్ర హోమ్ శాఖని ఆదేశించింది. 

కర్ణాటకలో ఇంతకాలం అధికారంలో ఉన్న బీజేపీ ఎన్నికలలో ఓడిపోయి ప్రతిపక్షంలోకి మారగా ప్రస్తుతం కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలో ఉంది. కనుక రెండు పార్టీల మద్య ఈ ప్రేలుడుపై రాజకీయ పోరాటం కూడా ప్రారంభం అయ్యింది. 

బెంగళూరులో ఈ బాంబు ప్రేలుడు వార్త చెవిన పడగానే హైదరాబాద్‌ పోలీసులు అప్రమత్తమయ్యారు. శుక్రవారం అర్దరాత్రి నగరంలో పలు ప్రాంతాలలో భారీగా పోలీసులను మోహరించి వచ్చి పోయే వాహనాలను తనికీలు చేపట్టారు.