జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ శనివారం తెలంగాణాలో జనసేన పార్టీ కార్యవర్గ సభ్యులు కొందరిని నియమించారు. తెలంగాణా జనసేన పార్టీ ఇన్-చార్జ్ గా నేమూరి శంకర్ గౌడ్, తెలంగాణా రాజకీయ కార్యక్రమాల సమన్వయ కర్తగా మహేందర్ రెడ్డి, పార్టీ మీడియా ఇన్-చార్జ్ గా పి.హరి ప్రసాద్ ని నియమించారు.
ఆయన ఆంధ్రాప్రదేశ్ లో తన పార్టీ నిర్మాణం చేసుకొంటారని అందరూ భావిస్తున్న సమయంలో తెలంగాణాలో పార్టీ నిర్మాణ కార్యక్రమాలు మొదలుపెట్టడం చాలా విచిత్రంగానే ఉంది. తెలంగాణాలో కూడా పవన్ కళ్యాణ్ కి చాలా మంది అభిమానులు ఉన్నారు. కానీ వారు జనసేనకి అండగా నిలుస్తారా? అనేదే సందేహం. పవన్ కళ్యాణ్ చర్య తెరాసకి పెద్ద షాక్ అవుతుంది. రాష్ట్రంలో ప్రతిపక్షపార్టీలని అన్నిటినీ ఫిరాయింపులతో పూర్తిగా బలహీనపరిచి రాష్ట్రంలో తెరాసకి ఇక ఎదురేలేదని భావిస్తుంటే పవన్ కళ్యాణ్ సవాల్ విసరడానికి సిద్దమవుతున్నారు. కనుక త్వరలోనే తెరాస నుంచి పవన్ కళ్యాణ్ కి గట్టి జవాబే రావచ్చు.