బిఆర్ఎస్ పార్టీ శాసనసభ ఎన్నికలలో ఓడిపోయి ఇప్పుడిప్పుడే ఆ షాక్ నుంచి తేరుకుంటోంది. త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికలకు సిద్దం అవుతోంది. ఇటువంటి కీలక సమయంలో కేసీఆర్, కేటీఆర్‌లకు బిఆర్ఎస్ పార్టీ నేతలు వరుసగా షాకులు ఇస్తున్నారు.
ఇటీవల జీహెచ్‌ఎంసీ డెప్యూటీ మేయర్ మోతే శ్రీలత దంపతులు పార్టీకి గుడ్ బై చెప్పిసి కాంగ్రెస్ పార్టీలో చేరిపోగా, నాగర్‌కర్నూల్ ఎంపీ పోతుగంటి రాములు కూడా పార్టీకి గుడ్ బై చెప్పేసి బీజేపీలో చేరిపోయేందుకు సిద్దమయ్యారు. జహీరాబాద్ బిఆర్ఎస్ పార్టీ ఎంపీ బీబీ పాటిల్ ఈరోజు పార్టీకి రాజీనామా చేసి ఢిల్లీలో బీజేపీలో చేరిపోయారు. తరుణ్ చుగ్ ఆయనకు కాషాయ కండువా కప్పి బీజేపీలోకి సాదరంగా ఆహ్వానించారు. ఆయన 2014, 2019లో వరుసగా రెండుసార్లు జహీరాబాద్ నుంచి లోక్‌సభకు పోటీ చేసి ఎంపీ అయ్యారు.
ఒకవేళ లోక్‌సభ ఎన్నికలలో బిఆర్ఎస్ పార్టీ కనీసం 9-10 ఎంపీ సీట్లు గెలుచుకోలేకపోతే పార్టీ నుంచి వలసలు మొదలయ్యే అవకాశం ఉందని రాజకీయ విశ్లేషకులు చెపుతుంటే, ఎన్నికల షెడ్యూల్ వెలువడక మునుపే వలసలు మొదలవడం బిఆర్ఎస్ పార్టీకి చాలా ఆందోళన కలిగించేదే.