తెలంగాణకు ప్రధాని నరేంద్రమోడీ... ఈసారి డిఫరెంట్!

ప్రధాని నరేంద్రమోడీ మార్చి 4,5 తేదీలలో తెలంగాణ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో త్వరలో జరుగబోయే లోక్‌సభ ఎన్నికల ప్రచారంతో పాటు జిల్లాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలలో ప్రధాని నరేంద్రమోడీ పాల్గొంటారు. 

ప్రధాని నరేంద్రమోడీ పర్యటన షెడ్యూల్: 

తొలిరోజున ఉదయం 11 గంటలకు ఆదిలాబాద్‌ జిల్లాలో కొన్ని అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. ఆ తర్వాత ఉదయం 11 గంటలకు జిల్లా కేంద్రంలో జరిగే ఎన్నికల ప్రచార సభలో పాల్గొంటారు. 

అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో హైదరాబాద్‌ చేరుకొని రాత్రి రాజ్‌భవన్‌లో బస చేస్తారు. మర్నాడు అంటే మార్చి 5వ తేదీ ఉదయం సంగారెడ్డిలో ఉదయం 11 గంటలకు పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారు. తర్వాత అక్కడే బహిరంగ సభలో పాల్గొంటారు. ఆ తర్వాత హైదరాబాద్‌ నుంచి ప్రత్యేక విమానంలో ఒడిశా రాజధాని భువనేశ్వర్‌కు బయలుదేరుతారు. 

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రధాని నరేంద్రమోడీ తొలిసారిగా రాష్ట్రానికి వస్తున్నారు. ఇంతకు ముందు కేసీఆర్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు, ప్రధాని రాష్ట్ర పర్యటనకు వస్తే ఆయన పట్ల అవమానకరంగా ప్రవర్తించడమే కాకుండా, ఆయనను విమర్శిస్తూ హైదరాబాద్‌లో ఫ్లెక్సీ బ్యానర్లు కూడా పెట్టించేవారు.

కానీ సిఎం రేవంత్‌ రెడ్డి రాజకీయంగా బీజేపీని, ప్రధాని నరేంద్రమోడీని వ్యతిరేకిస్తునప్పటికీ ఆయన పట్ల చాలా గౌరవంగా వ్యవహరిస్తున్నారు. కనుక ఈసారి ప్రధాని పర్యటనకు వచ్చినప్పుడు బహుశః సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా విమానాశ్రయానికి వెళ్ళి ఆయనకు స్వాగతం పలకవచ్చు. అలాగే ప్రధాని పర్యటనలో ప్రోటోకాల్ మర్యాదలు సక్రమంగా జరిగేందుకు చర్యలు తీసుకుంటారని ఆశించవచ్చు.