విశాఖ నగరానికి సముద్రతీరం ప్రత్యేక ఆకర్షణకాగా దానికి మరింత మెరుగులు దిద్దుతూ బీచ్ రోడ్ పొడవునా అనేక పార్కులు, ప్రముఖుల విగ్రహాలు, సబ్ మెరైన్ మ్యూజియం, ఫైటర్ ప్లేన్ మ్యూజియం, నేవీ మ్యూజియం, ఇంకా అనేకం ఏర్పాటు చేసింది జీవీఎంసీ.
తాజాగా ఆర్కె బీచ్ సమీపంలో మొన్న ఆదివారం సముద్రంపై తెలియాడే ‘ఫ్లోటింగ్ బ్రిడ్జ్’ ఏర్పాటు చేశారు. ఒక కోటి అరవై లక్షల వ్యయంతో దీనిని ఏర్పాటు చేశారు. సముద్రం అలలపై తేలియాడే ఈ వంతెనపై ఒడ్డు నుంచి సముద్రంలోకి 100 మీటర్లు దూరం వరకు పర్యాటకులు వెళ్ళగలగడం ఓ గొప్ప అనుభూతిని ఇస్తుంది.
సముద్రంపై తేలియాడే ఈ వంతెనను మొన్న ఆదివారమే వైసీపి ఎంపీ వైవీ సుబ్బారెడ్డి ప్రారంభించి సందర్శకులను అనుమతించారు. కానీ 24 గంటలు గడువక ముందే ఆ వంతెనలో చివర సందర్శకులు నిలబడి ఫోటోలు, వీడియోలు తీసుకునేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన టీ ఆకారంలో ప్లాట్ ఫారం వంతెన నుంచి విడిపోయి సముద్రంలో కొట్టుకుపోయింది.
అదృష్టవశాత్తు ఆ సమయంలో దానిపై సందర్శకులు లేకపోవడంతో పెను ప్రమాదం తప్పిపోయింది.
అయితే వంతెన నిర్వహణ కొరకు తమ సిబ్బందే వంతెన చివరి భాగాన్ని విడదీశారని దానిని ఏర్పాటు చేసిన సంస్థ చెపుతోంది. ఏది ఏమైనప్పటికీ ప్రారంభోత్సవం జరిగిన 24 గంటలలోనే వంతెన చివరి భాగం విడిపోవడం లేదా నిర్వహణ కోసం విడదీయాల్సి రావడం లోపాన్ని తెలియజేస్తోంది కదా?
(Video Courtecy: Suman TV)