ప్రధాని నరేంద్రమోడీ నేడు ఏపీ, తెలంగాణ రాష్ట్రాలతో సహా దేశవ్యాప్తంగా రైల్వేశాఖలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, పూర్తయిన వాటికి ఢిల్లీ నుంచి ప్రారంభోత్సవాలు చేయనున్నారు. వాటిలో తెలంగాణ రాష్ట్రంలో 17 రైల్వే వంతెనలు, అండర్ పాస్‌లకు నేడు శంకుస్థాపన చేస్తారు.
అమృత్ భారత్ పధకంలో భాగంగా తెలంగాణలో బేగంపేట, మెదక్, మేడ్చల్, యాకూత్‌పురా, షాద్ నగర్, నల్లగొండ, వరంగల్, బాసర, గద్వాల్, జడ్చర్ల, మంచిర్యాల, మిర్యాలగూడ, పెద్దపల్లి, ఉదానగర్, వికారాబాద్ రైల్వే స్టేషష్లలో రూ.230.24 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. ఈ పనులకు నేడు ప్రధాని నరేంద్రమోడీ శంకుస్థాపన చేస్తారు. ఈ రైల్వే స్టేషన్లలో లిఫ్టులు, ఎస్కలేటర్లు, ఫుట్ ఓవర్ బ్రిడ్జిలు, డిజిటల్ డిస్ప్లే బోర్డులు, సీసీటీవీలు, పార్కింగ్ తదితర సౌకర్యాలను కల్పించే పనులకు శంకుస్థాపన చేస్తారు.
ఇదే పధకంలో గత ఏడాది ఆగస్టులో శంకుస్థాపనలు చేసి పూర్తయిన 32 రైల్వే వంతెనలను, అండర్ పాస్‌లను ప్రధాని నరేంద్రమోడీ నేడు ప్రారంభోత్సవం చేస్తారు. నేడు ఢిల్లీలో జరిగే ఈ కార్యక్రమం రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్, కేంద్రమంత్రులు, రైల్వే ఉన్నతాధికారులు పాల్గొంటారు.