తెలంగాణ రాష్ట్రాన్ని సూచిస్తూ గత ప్రభుత్వం ‘టిఎస్’ని ఎంచుకోవడంతో అప్పటి నుంచి అదే వాడుకలో ఉంది. అయితే అది టిఆర్ఎస్ పార్టీని సూచిస్తున్నట్లు ఉందని, తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే దానిని ‘టీజీ’ (తెలంగాణ గవర్నమెంట్)గా మారుస్తామని ముందే చెప్పింది.
అధికారంలోకి రాగానే టిఎస్‌ను టీజీగా మార్చాలని కోరుతూ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వానికి ఫిబ్రవరి 5వ తేదీన ఓ లేఖ వ్రాసింది. రాష్ట్ర రవాణాశాఖ జాయింట్ కమీషనర్‌గా పాండు రంగనాయక్ స్వయంగా ఢిల్లీ వెళ్ళి కేంద్ర రవాణాశాఖ ఉన్నతాధికారులతో మాట్లాడి ఒప్పించారు.
కనుక ఒకటి రెండు రోజులలో టిఎస్‌ను టీజీగా మార్చుతూ కేంద్ర ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉంది. అది జారీ అయిన తర్వాత తెలంగాణలో కొత్తగా రిజిస్ట్రేషన్ చేయబోయే వాహనాలన్నిటికీ టిఎస్‌కు బదులు టీజీతో రవాణాశాఖ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లు జారీ చేస్తుంది.
తెలంగాణలో అన్ని రకాల వాహనాలు కలిపి 1.64 కోట్లు ఉన్నాయి. గత పదేళ్ళలో వాటిలో అత్యధిక శాతం వాహనాలకు టిఎస్ రిజిస్ట్రేషన్ నంబర్లే ఇవ్వడం జరిగింది. వాటన్నిటినీ మార్చడం భారీ వ్యయప్రయాసలతో కూడుకున్నది కనుక వాటికి ఈ మార్పు వర్తింపజేయకూడదని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.