త్వరలో లోక్‌సభ ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక ఆ ఎన్నికలలో కూడా తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఎక్కువ సీట్లు గెలుచుకోవాలంటే ప్రజలకు తమ ప్రభుత్వంపై నమ్మకం కలిగించాలి. అందుకు ఒకటే మార్గం. శాసనసభ ఎన్నికలలో ఇచ్చిన హామీలలో ప్రజలు ఎదురుచూస్తున్న సంక్షేమ పధకాలను అమలుచేయడమే.
వాటిలో గృహజ్యోతి పధకంలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ అందించడం, మహాలక్ష్మి పధకంలో మహిళలకు నెలకు రూ.2,500 పింఛన్ అందించడం. వీటిలో మొదటి రెండు హామీలను అమలుచేయడానికి కాంగ్రెస్ ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
సిఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన గురువారం సచివాలయంలో మంత్రివర్గం సబ్ కమిటీ సమావేశమై ఈ రెండు హామీల గురించి చర్చింది. మార్చి నుంచే ఉచిత విద్యుత్ సరఫరా చేయాలని, అర్హులైన కుటుంబాలకు ‘జీరో బిల్లు’ ఇచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని సిఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.
రూ.500లకు రాయితీ గ్యాస్ సిలిండర్స్ అందించడంపై కూడా ఈ సమావేశంలో లోతుగా చర్చించిన తర్వాత, రాయితీ సొమ్ముని లబ్ధిదారులకు ఇవ్వడం కంటే, గ్యాస్ డీలర్లకే చెల్లించడం మంచిదని నిర్ణయించారు. కనుక ఈ సమావేశం ముగిసిన తర్వాత పౌరసరఫరాల శాఖ కమీషనర్ డిఎస్ చౌహాన్, ఆ శాఖ ఉన్నతాధికారులు సివిల్ సప్లైస్ భవన్‌లో గ్యాస్ డీలర్లతో సమావేశం నిర్వహించారు.
ప్రభుత్వం వారి బ్యాంక్ ఖాతాలలో రాయితీ సొమ్ముని జమా చేస్తుందని, కనుక ప్రభుత్వం గురించి అర్హులకు రూ.500కే గ్యాస్ సిలిండర్స్ ఇవ్వాలని సూచించగా డీలర్లు అందుకు అంగీకరించారు.
ఈ నెల 27 లేదా 29వ తేదీ నుంచి ఈ రెండు పధకాలను సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు కలిసి లాంఛనంగా ప్రారంభించే అవకాశం ఉంది. దీని తర్వాత ఎన్నికల షెడ్యూల్ వెలువడేలోగా మహాలక్ష్మి పధకంలో రూ.2,500 పింఛన్, రైతు భరోసా పధకాలను కూడా అమలుచేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది.