జగనన్న రాజ్యంలో చెల్లి షర్మిల అరెస్ట్!

ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి సొంత చెల్లెలు వైఎస్ షర్మిలని ఏపీ పోలీసులు నేడు విజయవాడలో అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు.

ఆమె ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్న జగన్మోహన్‌ రెడ్డి, ఆయన ప్రభుత్వం విధానాలపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. దీంతో ఆమెను ఏవిదంగా ఎదుర్కోవాలో తెలియక అటు వైసీపి నేతలు, ఇటు జగన్‌ ప్రభుత్వం కూడా తల పట్టుకుంటోంది. 

ఆమె మెగా డీఎస్సీ ప్రకటించాలని డిమాండ్ చేస్తూ నేడు ఏపీ సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చారు. దీంతో ఆమెను పోలీసులు అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించగా, నిన్న రాత్రి నుంచి ఈరోజు ఉదయం వరకు విజయవాడలో కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయంలో ‘ఆంధ్ర రత్న’ భవనంలో ఉండిపోయారు. 

ఆమెను బయటకు రాకుండా పోలీసులు గృహ నిర్బంధం చేయడంతో పార్టీ నేతలతో కలిసి పార్టీ కార్యాలయం బయటే దీక్షకు కూర్చున్నారు. ఈరోజు మధ్యాహ్నం ఆమె వారితో కలిసి సచివాలయానికి బయలుదేరగా, దారిలో పోలీసులు వారిని అడ్డుకొని, వైఎస్ షర్మిలని అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలించారు. 

దీంతో ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి జగన్మోహన్‌ రెడ్డి తన సొంత చెల్లినే అరెస్ట్ చేయించి దేశ రాజకీయాలలో సరికొత్త రికార్డ్ సృష్టించుకున్నారు.