లిక్కర్ స్కామ్‌లో ఢిల్లీ సిఎం కేజ్రీవాల్‌కు ఈడీ నోటీస్... 7వ సారి

ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న వారిలో ఢిల్లీ ముఖ్యమంత్రి అర్వింద్ కేజ్రీవాల్, ఉప ముఖ్యమంత్రి మనీష్ శిశోడియాలు కూడా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో ఈడీ అధికారులు మనీష్ శిశోడియాని అరెస్ట్ చేయగా, ఇప్పుడు అర్వింద్ కేజ్రీవాల్‌ని కూడా లోపల వేసేందుకు విశ్వప్రయత్నాలు చేస్తోంది.

ఈ కేసులో విచారణకు హాజరుకావాలంటూ ఈడీ మరోసారి ఆయనకు నోటీస్ పంపింది. ఈ నెల 26న ఢిల్లీలో తమ కార్యాలయంలో విచారణకు హాజరుకావాలని ఈడీ నోటీసులో పేర్కొంది. అయితే ఈడీ ఇప్పటికే ఆరుసార్లు పంపిన నోటీసులను ఆయన పట్టించుకోలేదు. కానీ ఆయనకు ముఖ్యమంత్రిగా చట్టపరమైన రక్షణ కవచం ఉన్నందున ఈడీ ఆయనకు నోటీసులు పంపగలుగుతోంది కానీ విచారణకు రప్పించలేకపోతోంది.

విచారణ పేరుతో తనను ఈడీ కార్యాలయానికి రప్పించి అరెస్ట్ చేసేందుకు కుట్ర పన్నుతోందని అర్వింద్ కేజ్రీవాల్‌ ఆరోపిస్తున్నారు. ఢిల్లీలో ఆమాద్మీ పార్టీని ఓడించి అధికారం చేజిక్కించుకోవాలని బీజేపీ చాలా కాలంగా ప్రయత్నిస్తోంది. కానీ ఢిల్లీ ప్రజలు ఆమద్మీ పార్టీకే ఓట్లు వేసి గెలిపిస్తున్నారు.

బహుశః అందుకే ఢిల్లీ లిక్కర్ స్కామ్‌ కేసుని ఉపయోగించుకొని, అర్వింద్ కేజ్రీవాల్‌ని లొంగదీసుకోవడమో లేదా రాజకీయంగా దెబ్బతీయడమో చేయాలని మోడీ ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అమాద్మీ పార్టీ ఆరోపిస్తోంది.