తెలంగాణ సిఎం రేవంత్ రెడ్డి, మంత్రులు, ప్రజా ప్రతినిధులతో కలిసి నారాయణపేట జిల్లా కొస్గీలో నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోతల పధకంతో సహా రూ.4,369 కోట్లు విలువగల పలు అభివృద్ధి పనులకు బుధవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మహిళా సంఘాలకు రూ.177 కోట్ల చెక్కుని అందజేశారు. రాష్ట్రంలో మహిళల అభ్యున్నతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉంటుందని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.
ఈ నిధులతో ఎత్తిపోతల పధకంతో పాటు కొడంగల్లో మెడికల్ కాలేజీ, ఇంజనీరింగ్ కాలేజీ, ప్రభుత్వ జూనియర్ కాలేజీ, మహిళా డిగ్రీ కాలేజీ, గురుకుల పాఠశాలను ప్రభుత్వం నిర్మించబోతోంది.
ఈ సందర్భంగా సిఎం రేవంత్ రెడ్డి ప్రజలని ఉద్దేశ్యించి మాట్లాడుతూ కాంగ్రెస్ ఆరు గ్యారెంటీలలో గృహజ్యోతి, మహాలక్ష్మి పధకాలలో 200 యూనిట్లు ఉచిత విద్యుత్ సరఫరా, రూ.500లకే వంట గ్యాస్ సిలిండర్ హామీలను వచ్చే వారం నుంచే అమలు చేయబోతున్నామని ప్రకటించారు.
ఇవి కాక మార్చి 15లోగా రైతు భరోసా పధకంలో రైతుల ఖాతాలలో నగదు జమా చేస్తామని చెప్పారు. అలాగే రైతులకు రూ.2 లక్షల పంట రుణాలు మాఫీ చేస్తామనే హామీని నిలబెట్టుకుంటామని సిఎం రేవంత్ రెడ్డి చెప్పారు.