ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితని ఈడీ అధికారులు తమ కార్యాలయంలో ఒంటరిగా విచారణ జరపడాన్ని సవాలు చేస్తూ వేసిన పిటిషన్‌పై నేడు జస్టిస్ బెలా ఎం త్రివేది, జస్టిస్ పంకజ్ మిత్తల్ కూడిన సుప్రీంకోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారణ చేపట్టింది.
తొలుత ఆమె పిటిషన్ కేసుని నళినీ చిదంబరం, అభిషేక్ బెనర్జీల కేసులతో కలిపి విచారిస్తామని సుప్రీంకోర్టు తెలిపింది. కానీ ఆ కేసులతో కల్వకుంట్ల కవిత కేసుకి సంబంధం లేనందున ఈ నెల 28న విడిగానే విచారణ జరుపుతామని తెలియజేస్తూ ఆ రోజుకి వాయిదా వేసింది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఇప్పటికీ ఢిల్లీ డెప్యూటీ మనీష్ శిసోడియాని అరెస్ట్ కాగా ఢిల్లీ సిఎం అరవింద్ కేజ్రీవాల్‌ని కూడా ప్రశ్నించేందుకు ఈడీ అధికారులు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆయనకు ముఖ్యమంత్రిగా చట్టపరమైన రక్షణ ఉంటుంది కనుక విచారణకు రప్పించలేకపోతున్నారు.
ఇదే కేసులో కల్వకుంట్ల కవితతో పాటు ప్రధాన నిందితుడుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏపీ వైసీపి ఎంపీ మాగుంట శ్రీనివాసులు రెడ్డిని ఈడీ ఇంతవరకు ఒక్కసారి కూడా ప్రశ్నించకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది.