సిద్ధిపేట జిల్లా కొమురవెల్లి మల్లన్నస్వామిన ఆలయం సమీపంలో కొత్తగా రైల్వే స్టేషన్ రాబోతోంది.
కొత్తపల్లి-మనోహరాబాద్ రైల్వే మార్గంలో ఉన్న కొమురవెల్లి మల్లన్న స్వామివారి ఆలయానికి నిత్యం రాష్ట్రం నలుమూలల నుంచి, ఇరుగు పొరుగు రాష్ట్రాల నుంచి కూడా ఏటా సుమారు 25 లక్షల మంది భక్తులు వస్తుంటారు.
కనుక కొమురవెల్లి ఆలయం సమీపంలో రైల్వే స్టేషన్ నిర్మిస్తే భక్తులకు చాలా సౌకర్యంగా ఉంటుందని తెలంగాణ కాంగ్రెస్, బీజేపీ, బిఆర్ఎస్ ఎంపీలు రైల్వేమంత్రి అశ్వినీ వైష్ణవ్‌ని కలిసి కోరగా ఆయన సానుకూలంగా స్పందించి రైల్వేశాఖలో సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. రైల్వేశాఖ కూడా కొమురవెల్లి రైల్వే స్టేషన్ నిర్మాణానికి సర్వే చేయించి వెంటనే అనుమతులు మంజూరు చేసింది.
కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, రాజ్యసభ సభ్యుడు కె.లక్ష్మణ్, దుబ్బాక బీజేపీ మాజీ ఎమ్మెల్యే రఘునందన్ రావు తదితరులు ఈరోజు కొమురవెల్లి రైల్వే స్టేషన్‌కు భూమిపూజ చేశారు. ఈ రైల్వే స్టేషన్ కొమురవెల్లి మల్లన్న ఆలయానికి మూడు కిలోమీటర్ల దూరంలో ఉంటుంది. కనుక దీని నిర్మాణం పూర్తయి అందుబాటులోకి వస్తే తెలంగాణతో సహా ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులు సులువుగా కొమురవెల్లి మల్లన్న ఆలయానికి చేరుకోవచ్చు.