గురువారం హైదరాబాద్, ఎల్బీ స్టేడియంలో గురుకుల ఉపాధ్యాయులకు నియామక పత్రాలు అందించే కార్యక్రమం జరిగింది. సిఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడుతూ, “మాజీ మంత్రి హరీష్ రావు నిన్న ఓ మాటన్నాడు. నేను పదవికి రాజీనామా చేస్తే తాను ముఖ్యమంత్రి అవుతాడట. మేడిగడ్డ బ్యారేజికి మరమత్తులు చేయిస్తాడట.
ఆనాడు ఔరంగజేబు పదవి చేపట్టాలనుకున్నప్పుడు తండ్రిని జైల్లో పెట్టించి, సోదరుడుని చంపేశాడు. హరీష్ రావు కూడా ఏదో రోజు కేసీఆర్, కేటీఆర్‌లను పక్కకు తప్పించి బిఆర్ఎస్ పార్టీని కబ్జా చేయవచ్చు.
పదేళ్ళు మీ ప్రభుత్వమే అధికారంలో ఉంది కదా? అప్పుడు ఎందుకు ఉద్యోగాలు భర్తీ చేయలేదు? మీరు అధికారంలో ఉన్నప్పుడే నియామక పత్రాలు ఇచ్చుకోవచ్చు కదా?మేము అధికారంలోకి రాగానే ఉద్యోగ నియామకాలకు ఎదురవుతున్న అడ్డంకులన్నిటినీ తొలగించి నియామక పత్రాలను అందిస్తుంటే మామ, అల్లుళ్ళు, తండ్రీ కొడుకులు మా మీద పడి ఏడవడం ఎందుకు?
కాళేశ్వరం ప్రాజెక్టులో వాళ్ళు చేసిన అవినీతి, మేడిగడ్డ బ్యారేజి క్రుంగిపోవడం గురించి శాసనసభలో చర్చిద్దామంటే అందరూ పారిపోయారు. మేడిగడ్డ బ్యారేజి వద్దకు రమ్మని పిలిస్తే రాకుండా నల్గొండలో సభ పెట్టుకుని నోటికి వచ్చినట్లు మాట్లాడారు.
వాళ్ళు ఏమన్నా మేము సహిస్తూ ఉండాలా? వాళ్ళు చేసిన తప్పులు, వారి అవినీతి వలన తెలంగాణ రాష్ట్రానికి, ప్రజలకు కలిగిన నష్టం గురించి మేము చెప్పకుండా దాచిపెట్టి ఉంచాలా?,” అంటూ సిఎం రేవంత్ రెడ్డి నిప్పులు చెరిగారు.