నేడు కాంగ్రెస్‌లో చేరనున్న పట్నం సునీతారెడ్డి

వికారాబాద్‌ జెడ్పీ ఛైర్ పర్సన్‌, మాజీ మంత్రి పట్నం మహేందర్ రెడ్డి భార్య సునీతారెడ్డి, వారి కుమారుడు రినీష్ రెడ్డి నేడు కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. ఆమె నిన్న బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు.

ఈరోజు మధ్యాహ్నం తమ అనుచరులు, స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులతో కలిసి వారిరురువూ ఊరేగింపుగా మధ్యాహ్నం 12 గంటలకు గాంధీ భవన్‌ చేరుకుంటారు. పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి దీపాదాస్ మున్షీ, సిఎం రేవంత్‌ రెడ్డి, కాంగ్రెస్‌ నేతల సమక్షంలో వారిరువురూ కాంగ్రెస్ పార్టీలో చేరబోతున్నారు. 

లోక్‌సభ ఎన్నికలలో తెలంగాణలోని 17 స్థానాలలో ఈసారి కనీసం 12 స్థానాలు గెలుచుకోవాలని కాంగ్రెస్ పార్టీ చాలా పట్టుదలగా ఉంది. కనుక చేవెళ్ళ నుంచి పట్నం సునీతా రెడ్డికి టికెట్‌ ఖరారు చేసిన్నట్లు తెలుస్తోంది. 

2018 ముందస్తు శాసనసభ ఎన్నికలలో వికారాబాద్‌ జిల్లా కొడంగల్‌ నుంచి రేవంత్‌ రెడ్డి కాంగ్రెస్‌ అభ్యర్ధిగా పోటీ చేసినప్పుడు, కేసీఆర్‌ ఆయనను ఓడించే బాధ్యత పట్నం సోదరులకే అప్పగించారు. అప్పుడు పట్నం మహేందర్ రెడ్డి సోదరుడు పట్నం నరేందర్ రెడ్డి బిఆర్ఎస్ అభ్యర్ధిగా పోటీ చేయగా, అన్నదమ్ములిద్దరూ కలిసి రేవంత్‌ రెడ్డిని ఓడించారు.

ఇప్పుడు అదే పట్నం మహేందర్ రెడ్డి కుటుంబాన్ని సిఎం రేవంత్‌ రెడ్డి స్వయంగా కాంగ్రెస్ పార్టీలో చేర్చుకొని, చేవెళ్ళలో బిఆర్ఎస్ అభ్యర్ధిని ఓడించేందుకు ఉపయోగించుకుంటుండటం విశేషమే కదా?